గర్భధారణ సమయంలో పిండం పెరిగేకొద్దీ తల్లి ఆహార అవసరాలు కూడా పెరుగుతాయి. 12వ వారంలో 15 గ్రాముల బరువు ఉండే పిండం 40వ వారానికి వచ్చేసరికి.. 3,200 గ్రాములకు చేరుకుంటుంది. తనకు కావలసిన పోషక అవసరాలను తల్లి ద్వారానే సమకూర్చుకుంటుంది. ఈ దశలో తల్లికి పౌష్టికాహారం అందకపోతే, ఇద్దరిలోనూ ఆహార లోపాలు ఏర్పడి అనేక సమస్యలకు దారితీయవచ్చు. ఆహార లోపాలు తీవ్రంగా ఉన్నప్పుడు బరువు తక్కువ శిశువు జన్మించవచ్చు. మిగిలినవారితో పోలిస్తే, ఇలాంటి పిల్లల్లో అంటువ్యాధులకు ఆస్కారం ఎక్కువ.
ఆరోగ్య, ఆహార లోపాలు లేని స్త్రీలు గర్భధారణ వల్ల దాదాపు 11-12 కిలోల బరువు పెరుగుతారు. గర్భం చివరి దశలో ఆహారలోపాలు మరీ తీవ్రంగా పరిణమిస్తాయి. ప్రసవం తరువాత పాల తయారీకి కావలసిన పోషక పదార్థాలను శరీరం సమకూర్చుకోలేక పోతుంది. దీంతో పాల ఉత్పత్తి, నాణ్యత తగ్గుతుంది. గర్భిణుల ఆహార అవసరాలు చివరి 4 నెలలలో మరీ ఎక్కువ, శిశువు శరీరంలో ఉండే మాంసకృత్తులలో మూడింట రెండు వంతులు చివరి 2-3 నెలల్లోనే సమకూరతాయి. ఇదే దశలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా శరీరంలో చేరతాయి. అందువల్లే నెలలు నిండని శిశువులలో ఇనుము, క్యాల్షియం తదితర లోపాలు బాగా కనిపిస్తాయి.
అపోహలు అనేకం..
ఆహార లోపాలకు పేదరికమే కాకుండా ప్రజల్లో అనాదిగా వస్తున్న అపోహలు కూడా కారణమే. చాలా కుటుంబాల్లో మొదటి పంక్తిలో మగవాళ్లు తిన్నాక మిగిలిన ఆహారాన్ని స్త్రీలు, పిల్లలు ఆరగిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు అర్ధాకలి తప్పదు. ఫలితంగా గర్భిణి పోషకాల లోపాన్ని ఎదుర్కొంటుంది. ఇంకొన్ని కుటుంబాల్లో గర్భధారణ, ప్రసవం తరువాత ‘ఇది తినవద్దు, అది తినవద్దు’ అంటూ కట్టడి చేస్తుంటారు. ఇది కూడా సరికాదు. మంచి ఆహారం తీసుకున్నట్లయితే పుట్టే శిశువు లావుగా ఉంటుందనీ.. ఫలితంగా ప్రసవం కష్టం అవుతుందనీ నమ్మేవారూ ఉన్నారు. ఈ అభిప్రాయమూ తప్పే. గర్భం ధరించిన సమయంలో, బిడ్డకు స్తన్యం ఇస్తున్నప్పుడూ గతంతో పోలిస్తే.. దాదాపు 25 శాతం ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు