Pimples Home Remedies | ప్రస్తుత తరుణంలో అందంగా కనిపించాలని కేవలం స్త్రీలే కాదు.. పురుషులు కూడా కోరుకుంటున్నారు. అందుకనే వారి కోసం అనేక బ్యూటీ పార్లర్లు కూడా వెలుస్తున్నాయి. ముఖం అందంగా కనిపించాలని చాలా మంది ఆశిస్తున్నారు. అందుకనే ఖరీదైన చికిత్సలు తీసుకోవడం, క్రీముటు గట్రా రాయడం చేస్తున్నారు. అయితే పలు సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటిస్తే ముఖాన్ని అందంగా కనిపించేలా చేయవచ్చు. దీంతోపాటు ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా పోతాయి. ఇందకు ఖరీదైన చికిత్సలను ఉపయోగించాల్సిన పనిలేదు. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే పలు మిశ్రమాలను తయారు చేసి వాడడం వల్ల ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం అందంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖంపై ఉండే మొటిమలను తగ్గించడంతోపాటు ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చడంలో టీ ట్రీ ఆయిల్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఒక కాటన్ బాల్‌ను టీ ట్రీ ఆయిల్లో ముంచి మొటిమలపై రాస్తుండాలి. రాత్రి పూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయాన్నే ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే మొటిమలను తగ్గించడంలో తేనె కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను, వాటి వల్ల కలిగే ఎరుపు దనాన్ని, వాపులను తగ్గిస్తాయి. కొద్ది తేనె తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాత్రి పూట రాయాలి. మరుసటి రోజు కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. ముఖం అందంగా మారుతుంది.
మన ఇంటి పెరట్లో ఉండే కలబంద కూడా మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. మృత చర్మ కణాలను తొలగించి ఉన్న కణాలకు మరమ్మత్తులు చేస్తాయి. దీంతో మొటిమలు తగ్గిపోతాయి. కలబంద గుజ్జును నేరుగా మొటిమలపై రాయవచ్చు. తరచూ రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలను తగ్గించేందుకు ఓట్ మీల్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఓట్ మీల్‌ను ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఆగాలి. తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే దురద పోతుంది. మొటిమల సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
గ్రీన్ టీ పొడిని నీటిలో వేసి మరిగించి ఆ ఆకులను మొటిమలపై రాస్తుండాలి. దీంతో కూడా మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా రాత్రిపూట పసుపును పేస్ట్‌లా చేసి ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేస్తుండాలి. పసుపులో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే శనగపిండి కూడా మొటిమలను తగ్గించి ముఖానికి కాంతిని అందిస్తుంది. ఇందులో తేనెను కలిపి ఉపయోగించవచ్చు. ఇలా పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తుంది.