Throat Pain | గొంతు నొప్పి అనేది మనకు పలు కారణాల వల్ల వస్తుంది. సీజన్లు మారినప్పుడు లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా, కఫం అధికంగా పేరుకుపోవడం, పడని ఆహారాలను తినడం వంటి కారణాల వల్ల గొంతు నొప్పి వస్తుంది. దీంతోపాటు గొంతులో గరగరగా, మంటగా కూడా ఉంటుంది. కొందరికి దగ్గు కూడా వస్తుంది. అయితే ఇలాంటి గొంతు సమస్యలు ఉంటే చాలా మంది టానిక్లను తెచ్చుకుని తాగుతారు లేదా మెడిసిన్‌ను వేసుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు నొప్పి లేదా ఇతర గొంతు సమస్యలను తగ్గించేందుకు ఉప్పు నీరు బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి కలిపి ఆ నీళ్లను గొంతులో పోసుకుని పుక్కిట పట్టాలి. ఇలా చేస్తుంటే సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పిని తగ్గించడంలో తేనె కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ఇందులో సహజసిద్ధమైన డిమల్సెంట్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. తేనెను 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 సార్లు సేవిస్తుండాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. అల్లం టీలోనూ తేనె కలిపి తాగితే ఉపయోగం ఉంటుంది. గొంతు సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనెను ఇవ్వకూడదు.
గొంతు నొప్పి లేదా ఇతర గొంతు సమస్యలను తగ్గించేందుకు హెర్బల్ టీలు బాగా పనిచేస్తాయి. ఇవి గొంతులో ఉండే కఫాన్ని తొలగిస్తాయి. ఈ టీలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఈ టీలను సేవించడం వల్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేసి మరిగించాలి. అనంతరం వచ్చే నీళ్లను వడకట్టి అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగాల్సి ఉంటుంది. దీంతో గొంతు సమస్యలు తగ్గుముఖం పడతాయి. గొంతు సమస్యలకు అతి మధురం కూడా చక్కగా పనిచేస్తుంది. చిన్న అతి మధురం వేరు ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతున్నా కూడా గొంతులో నొప్పి, మంట తగ్గిపోతాయి. ముక్కు దిబ్బడ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని వడకట్టి తాగాలి. పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పి, మంట, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తాయి. పాలలో పసుపు కలిపి తాగుతున్నా కూడా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తాగాల్సి ఉంటుంది. మెంతులను నీటిలో వేసి మరిగించి అనంతరం వచ్చే నీళ్లను వడకట్టి అందులో కాస్త తేనె కలిపి తాగుతుండాలి. రోజుకు దీన్ని 3 సార్ల వరకు తాగవచ్చు. గొంతు సమస్యలను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి రోజుకు 2 సార్లు తాగుతుంటే ఫలితం ఉంటుంది. ఇలా ఈ సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి గొంతు నొప్పి, ఇతర గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.