Cracked Lips | చలికాలంలో సహజంగానే ఎవరికైనా సరే పెదవులు పగులుతుంటాయి. కానీ కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ పెదవులు పగులుతూ ఉంటాయి. దీంతో అక్కడి చర్మాన్ని కొరుకుతూ ఉంటారు. పెదవులు పగిలేందుకు అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం, పొడి వాతావరణంలో ఉండడం, ఏసీల్లో ఎక్కువగా గడపడం, సూర్యకాంతిలో ఎక్కువగా ఉండడం, డీహైడ్రేషన్ బారిన పడడం, పలు రకాల మందులను వాడడం లేదా విటమిన్ల లోపం వల్ల కూడా పెదవులు పగులుతుంటాయి. అయితే ఇందుకు ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు. పెదవులు పగలడాన్ని అడ్డుకోవచ్చు. దీంతో పెదవులు అందంగా మారి ఆకర్షణీయంగా కనిపిస్తాయి కూడా. ఇక అందుకు ఏం చేయాలంటే..
పగిలిన పెదవులను తిరిగి మామూలుగా చేయడంలో పెట్రోలియం జెల్లీ ఎంతగానో పనిచేస్తుంది. చాలా మంది చర్మ వ్యాధి నిపుణులు పెట్రోలియం జెల్లీని వాడడాన్ని సూచిస్తారు. ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు పెదవులపై పెట్రోలియం జెల్లీని రాస్తుండాలి. దీంతో పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులు మృదువుగా మారి అందంగా కనిపిస్తాయి. కొబ్బరినూనె కూడా ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా మారుస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదవలును ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రి పూట నిద్రకు ముందు కొబ్బరినూనెను పెదవులపై రాసి మరుసటి రోజు ఉదయం కడిగేస్తుండాలి. దీంతో పగిలిన పెదవులు తిరిగి పూర్వపు రూపాన్ని సొంతం చేసుకుంటాయి.
తేనె సహజసిద్ధమైన హ్యుమక్టెంట్గా పనిచేస్తుంది. అంటే చర్మానికి తేమను అందిస్తుందన్నమాట. ఇందులో శక్తివంతమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల కారణంగా పగిలిన పెదవులను తిరిగి మామూలు రూపం వచ్చేలా చేస్తాయి. పెదవులపై ఉండే మృత చర్మ కణాలను తొలగిస్తాయి. కొద్దిగా స్వచ్ఛమైన తేనెను తీసుకుని పెదవులపై రాయాలి. 15-20 నిమిషాల తరువాత కడిగేయాలి. లేదా రాత్రి పూట కూడా రాయవచ్చు. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా పెదవులు పగలడం తగ్గుతుంది. కలబంద గుజ్జు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని పునర్నిర్మిస్తాయి. మృతకణాలను తొలగించి కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. కొద్దిగా తాజా కలబంద గుజ్జును తీసుకుని పెదవులపై రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజుకు ఇలా 2 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.
మనం నెయ్యిని ఎంతో పూర్వకాలం నుంచే ఉపయోగిస్తున్నాం. ఇందులో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మారుస్తాయి. చర్మం పొడిబారకుండా చూస్తాయి. కొద్దిగా నెయ్యిని తీసుకుని వేడి చేసి రాత్రి నిద్రకు ముందు పెదవులపై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. లేదా రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం నెయ్యిని రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే పగిలిన పెదవులు తిరిగి చక్కని రూపాన్ని సంతరించుకుంటాయి. ఆలివ్ ఆయిల్ మన చర్మానికి సంరక్షణను అందిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను ఇస్తుంది. రాత్రి పూట నిద్రకు ముందు పెదవులపై కాస్త ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులు మృదువుగా మారి అందంగా కనిపిస్తాయి. కాంతివంతంగా ఉంటాయి.