Fat Cysts | శరీరంలో కొందరికి పలు భాగాల్లో కొవ్వు గడ్డలు ఏర్పడుతుంటాయి. మెడ, కాళ్లు, చేతులు వంటి భాగాల్లో సాధారణంగా కొవ్వు గడ్డలు వస్తుంటాయి. వీటినే లైపోమా అంటారు. సాధారణంగా ఇవి కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంటాయి. వీటితో ఎలాంటి హాని ఉండదు. కానీ గడ్డలు కనుక నొప్పిగా ఉండి కాలం గడిచే కొద్దీ గడ్డ పరిమాణం పెరుగుతుంటే దాన్ని అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి గడ్డలు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. కనుక నొప్పి ఉన్న గడ్డలు లేదా సైజు పెరిగే గడ్డలపై కచ్చితంగా డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఇక సాధారణ కొవ్వు గడ్డలు అయితే డాక్టర్‌ను కలిస్తే శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. అయితే అది కూడా అవసరం లేదని అనుకుంటే కొన్ని సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దీంతో కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. అందుకు ఏం చేయాలంటే..
పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కొవ్వు గడ్డలను కరిగించేందుకు సహాయం చేస్తాయి. పసుపులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా అవిసె గింజల నూనె కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని కొవ్వు గడ్డపై రాసి కట్టు కట్టాలి. లేదా బ్యాండేజ్ వేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో సహజంగా ఉండే ఆమ్లత్వం కారణంగా కొవ్వు కణాలను ఇది కరిగించేస్తుంది. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని నీళ్లు కలపాలి. పావు వంతు యాపిల్ సైడర్ వెనిగర్‌కు ముప్పావు వంతు నీళ్లను కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్‌ను ముంచి అనంతరం దాన్ని కొవ్వు గడ్డపై వేసి బ్యాండేజ్ లా కట్టు కట్టాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఆమ్లత్వం కారణంగా కొందరికి చర్మంపై దురదలు వస్తాయి. అలాంటి వారు దీన్ని వాడకూడదు.
అవిసె గింజల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. కొవ్వు గడ్డలను కరిగిస్తాయి. అవిసె గింజల నూనెను నేరుగా కొవ్వు గడ్డలపై రాయవచ్చు. రోజుకు ఇలా 3 లేదా 4 సార్లు చేస్తుండాలి. దీంతో కొద్ది రోజులకు కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. ఆముదం కూడా ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. ఇందులోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అనేక చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఆముదాన్ని నేరుగా కొవ్వు గడ్డలపై రాస్తుంటే ఫలితం ఉంటుంది.
అయితే ఈ చిట్కాలు పాటించినా కూడా కొవ్వు గడ్డలు కరిగిపోవడం లేదంటే అప్పుడు డాక్టర్‌ను కలవడం మంచిది. నొప్పి లేని గడ్డలను అయితే డాక్టర్లు చాలా సులభంగా తీసేస్తారు. కానీ కొవ్వు గడ్డలు నొప్పి ఉంటే మాత్రం కచ్చితంగా క్యాన్సర్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఇలాంటి గడ్డల ద్వారా కూడా కొన్ని సార్లు బయట పడుతుంది. అందుకని కొవ్వు గడ్డలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.