Hair Growth | ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వంశ పారంపర్యత, హార్మోన్ సమస్యలు అధికంగా ఉండడం, పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉండడం, పలు రకాల మందులను వాడడం, థైరాయిడ్ వంటి సమస్యలు, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలుతోంది. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలు చేయించుకోవాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కొబ్బరినూనె ఎంతగానో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు జుట్టుకు పోషణను అందిస్తాయి. శిరోజాలు కాంతివంతంగా మారి మెరిసేలా చేస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా మారేలా చేస్తాయి.
2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్న నూనెను జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. గంట పాటు అలాగే ఉంచాలి. లేదా రాత్రి పూట కూడా ఇలా రాయవచ్చు. అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి. వారంలో ఇలా 2 లేదా 3 సార్లు చేస్తుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టును పెరిగేలా చేయడంలో కలబంద కూడా సహాయం చేస్తుంది. కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. మృత చర్మ కణాలను తొలగిస్తాయి. కలబందలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల తలలో ఉండే దురద తగ్గిపోతుంది. అలాగే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. ఒక గంటపాటు ఉంచి తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను కూడా వారంలో 2 లేదా 3 సార్లు పాటిస్తుంటే ఉపయోగం ఉంటుంది.
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకుని బాగా దంచి మెత్తని పేస్ట్‌లా చేసి దాని నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక కాటన్ బాల్ సహాయంతో జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఉపయోగం ఉంటుంది. మెంతుల్లో ఉండే హార్మోన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. గుప్పెడు మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని అలాగే మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల కూడా జుట్టు రాలడం తగ్గి శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి.
జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు, జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేసేందుకు పలు ఆహారాలు కూడా ఎంతగానో సహాయం చేస్తాయి. కొందరికి పోషకాల లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. అందుకు గాను పోషకాలు ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్లు, చేపలు, చికెన్, బీన్స్, పప్పు దినుసులు, నట్స్, పాల ఉత్పత్తులను తీసుకుంటే శిరోజాలు రాలిపోవడాన్ని అరికట్టవచ్చు. పాలకూర, పప్పు దినుసులు, మటన్, తృణ ధాన్యాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జింక్ అధికంగా ఉండే గుమ్మడికాయ విత్తనాలు, శనగలు, సముద్రపు ఆహారాలను తినవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్ నట్స్‌ను తింటున్నా కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. విటమిన్ బి7 ఉండే తృణ ధాన్యాలు, గుడ్లు, అవకాడో, ఆకుకూరలను తింటున్నా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు చిట్కాలను పాటిస్తూ, పోషకాహారాలను తింటుంటే జుట్టు ఒత్తుగా పెరిగి కాంతివంతంగా కనిపిస్తుంది.