Skin And Hair Health | ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తీవ్రమైన ఒత్తిడి బారిన పడుతున్నారు. అలాగే అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతోంది. అలాగే కాలుష్యానికి కూడా గురవుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా చాలా మందికి వస్తున్నాయి. అయితే వీటన్నింటి వల్ల శిరోజాలు, చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, చిట్లిపోవడం, చర్మం కాంతివిహీనంగా మారడం, మొటిమలు, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
అయితే జుట్టు లేదా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రోటీన్లు ఎంతగానో దోహదపడతాయి. ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కెరాటిన్, కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి జుట్టు, చర్మానికి ఎంతగానో అవసరం. ప్రోటీన్లను రోజూ సరిగ్గా తీసుకోకపోతే జుట్టు సమస్యలు వస్తాయి. జుట్టు రాలుతూ చిట్లిపోతుంది. కాంతివిహీనంగా మారుతుంది. చుండ్రు సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే చర్మం కూడా పాలిపోయినట్లు అవుతుంది. చర్మం పగులుతుంది. కాంతిపోతుంది. కనుక ప్రోటీన్లు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శిరోజాలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
చాలా మంది స్వీట్లను అధికంగా తింటుంటారు. లేదా ఇతర తీపి పదార్థాలు, పిండి పదార్థాలను అధికంగా తింటుంటారు. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ శరీరంలో ఎక్కువగా ఉంటే అది చర్మం, జుట్టుపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మం నల్లగా అయ్యేలా చేస్తుంది. అలాగే శిరోజాలు రాలిపోతుంటాయి. జుట్టు చిట్లుతుంది. చుండ్రు సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతోపాటు శరీరంలో వాపులు వస్తాయి. కనుక తీపి పదార్థాలన తక్కువగా తినాలి. లేదా పూర్తిగా మానేస్తే శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి ఎక్కువగా అవకాడో, నట్స్, విత్తనాలు, చేపలు వంటి ఆహారాల్లో ఉంటాయి. కనుక ఈ ఆహారాలను తరచూ తింటుంటే శిరోజాలను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు శిరోజాలను చిట్లకుండా చూస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా కూడా ఉంటుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. కనుక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
రోజూ తగినన్ని నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. తగినన్ని నీళ్లను తాగకపోతే చర్మం డల్‌గా మారుతుంది. శిరోజాలు కాంతిని కోల్పోతాయి. మృదువుగా ఉండలేవు. కాబట్టి రోజుకు తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. చాలా మంది ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తింటుంటారు. ఇవి మనకు ఏమాత్రం లాభం కలిగించవు సరికదా, నష్టాన్నే కలిగిస్తాయి. ముఖ్యంగా జుట్టు, చర్మ సమస్యలను తెచ్చి పెడతాయి. కనుక ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే శిరోజాలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ ఆహారంలో మార్పులు చేసుకుంటే జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.