Fenugreek Seeds Water | మనం వంటల్లో వాడే వివిధ రకాల దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. దాదాపు ఇవి ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటాయని చెప్పవచ్చు. ఇవి కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయి. కనుక వీటిని వంటల్లో ఉపయోగించడానికి చాలా మంది ఇష్టపడరు. చేదుగా ఉన్నప్పటికీ మెంతులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మెంతుల్లో ఫైబర్, విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం వంటి లవణాలు కూడా ఉంటాయి. మెంతులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా మెంతులను నేరుగా తీసుకోవడంతోపాటు మెంతి నీటిని తాగడం వల్ల కూడా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెంతి నీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మెంతుల నీటిని తాగడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. మెంతినీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. అతిగా తినేవారు మెంతి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి మెంతినీరు ఎంతో సహాయపడుతుంది. మెంతినీటిని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెంతినీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు మెంతి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డయాబెటిస్ తో పాటు ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి మెంతినీరు ఎంతో దోహదకరంగా ఉంటాయి. మెంతినీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఉబ్బసం, శరీరంలో వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కనుక మెంతినీటిని ప్రతిరోజూ తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. శరీరంలో హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో కూడా మెంతి నీరు మనకు సహాయపడుతుంది. ముఖ్యంగా నెలసరి ఆగిపోయే ముందు, ఆగిన తరువాత మహిళల్లో అనేక హార్మోన్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు మెంతి నీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
మెంతినీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మొటిమల సమస్యతో బాధపడే వారు మెంతి నీటిని తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా మెంతినీరు మనకు సహాయపడుతుంది. మెంతినీటిని తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మెంతినీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా శరీరం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటుంది. ఈ విధంగా మెంతినీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఈ నీటిని ప్రతిరోజూ తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి. అంతేకాకుండా గ్లాస్ నీటిలో మెంతులను వేసి మరిగించి కూడా తీసుకోవచ్చు.