Fenugreek Seeds Water | మెంతులను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. మెంతులను వేసి చాలా మంది ఊరగాయ పచ్చళ్లను పెడుతుంటారు. మెంతులను పోపు దినుసులుగా ఉపయోగిస్తుంటారు. అయితే మెంతుల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజ ఉదయం ఆ నీళ్లను తాగాలి. అనంతరం ఆ మెంతులను తినాలి. ఇలా రోజూ పరగడుపునే చేయాల్సి ఉంటుంది. తరువాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం కానీ, ద్రవాలను కానీ తీసుకోరాదు. ఈ విధంగా మెంతులను రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. మెంతుల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటి వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
మెంతుల నీళ్లను తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు మెంతుల నీళ్లను కనీసం వారం రోజుల పాటు తాగితే కచ్చితంగా మార్పును గమనించవచ్చు. షుగర్‌ను తగ్గించడంలో మెంతుల నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల వాసన కొందరికి నచ్చదు. కనుక మెంతులను తినకపోయినా వాటిని నానబెట్టిన నీళ్లను తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మెంతుల నీళ్లను సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా శోషించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. పేగుల్లో ఉండే మలం, చెత్త, వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. దీంతో పెద్దపేగు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగకారక క్రిములను నాశనం చేస్తుంది.
అధిక బరువును తగ్గించడంలోనూ మెంతుల నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. ఉదయాన్నే ఈ నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మెంతుల నీళ్లను తాగడం వల్ల చర్మానికి సైతం ఎంతగానో మేలు జరుగుతుంది. చలికాలంలో చర్మం పగలకుండా చూసుకోవచ్చు. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మం మృదువుగా మారి తేమగా ఉంటుంది. చర్మం ప్రకాశిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ఇలా మెంతుల నీళ్లను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.