Fatty Liver Disease Symptoms | మన శరీరంలో లివర్ అనేక ముఖ్య విధులను నిర్వహిస్తుంది. సుమారుగా 800 జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించేందుకు లివర్ అవసరం అవుతుంది. అయితే లివర్ చేసే పనుల వల్ల అందులో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీన్ని రెండు రకాలుగా చెబుతారు. నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ అని ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. మద్యం సేవించకపోయినా తీసుకునే ఆహారాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. అయితే రెండింటిలోనూ లక్షణాలు సమానంగా కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో లివర్ వాపులకు గురవుతుంది. దీంతో లివర్ సైజు పెరుగుతుంది. లివర్ ఉన్న చోట చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. దీన్ని అందరూ గుర్తించలేకపోవచ్చు. కానీ లివర్ ఉన్న భాగంలో మాత్రం కాస్త నొప్పిగా అనిపిస్తుంది. ఇక లివర్ పెరిగిపోవడాన్ని హెపాటోమెగాలి అంటారు. ఫ్యాటీ లివర్ వచ్చిన వారిలో ఇలా జరుగుతుంది. కనుక మీకు ఈ లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో పాదాలు వాపులకు గురై కనిపిస్తుంటాయి.
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి ఏర్పడుతుంది. అలాగే ఆకలిగా కూడా ఉండదు. మెటబాలిజం సరిగ్గా ఉండదు. కొందరికి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. ఏ ఆహారాన్ని చూసినా వాంతికి వచ్చినట్లు అనినిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే ఫ్యాటీ లివర్ సమస్యగా అనుమానించాల్సిందే. మీరు నిద్ర నుంచి అప్పుడే లేచినప్పటికీ తీవ్రమైన అలసట ఉందంటే దాన్ని కూడా ఫ్యాటీ లివర్ సమస్యగా అనుమానించాలి. ఈ దశలో చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు లేనట్లు అనిపిస్తుంది.
లివర్ సమస్య ఉన్నవారిలో సహజంగానే పొట్ట ఉబ్బిపోయి కనిపిస్తుంది. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఈ సమస్య వచ్చినా కూడా దాన్ని ఫ్యాటీ లివర్ సమస్యగా అనుమానించాలి. లివర్ వ్యాధి ఉంటే శరీరంలోని వ్యర్థాలు సరిగ్గా బయటకు పోవు. దీంతో చర్మం దురదగా అనిపిస్తుంది. కొందరికి చర్మంపై దద్దుర్లు కూడా ఏర్పడుతుంటాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నప్పుడు చికిత్స తీసుకోకపోతే అది లివర్ సిర్రోసిస్‌గా మారే ప్రమాదం ఉంటుంది. కొందరికి ఇది క్యాన్సర్‌గా కూడా మారవచ్చు. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిందే. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సలహా మేరకు మందులను వాడాలి. అలాగే ఆరోగ్యవంతమైన ఆహారాలను తినాలి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ మళ్లీ ఎప్పటిలా పనిచేస్తుంది.