Visceral Fat | కొవ్వు.. మన శరీరంలో శక్తిని లిపిడ్ల రూపంలో నిల్వచేస్తుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణకు ఉపకరిస్తుంది. కొవ్వు ఎంత మంచిదైనా… శరీరాన్ని ఎబ్బెట్టుగా మారుస్తుంది. ఆకారం సంగతి అలా ఉంచితే.. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు లాంటి అవయవాల్లో పేరుకున్న- విసెరల్ కొవ్వు మాత్రం మరింత ప్రమాదకరమైనది. దీన్ని చురుకైన రోగ కారక కొవ్వు (యాక్టివ్ పాథోజెనిక్ ఫ్యాట్) అని పేర్కొంటారు.
పొట్ట భాగంలో కొవ్వు ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నేరుగా కాలేయంలోకి ప్రవేశిస్తాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్కు, హార్మోన్లను అడ్డుకునేందుకు కారణం అవుతుంది. శరీరంలో ఏ వ్యాధికైనా మూలకారణం ఇన్‌ఫ్లమేషనే. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుందంటే… ఇన్ఫ్లమేషన్ బాధ పొంచి ఉన్నట్టే.
ఇతర భాగాలతో పోలిస్తే .. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువ.
పొట్ట కొవ్వు వల్ల శరీరంలో హానికరమైన కొన్ని మాలిక్యులర్ ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు (బీపీ), కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెజబ్బులు, పక్షవాతం (స్ట్రోక్) ముప్పు ఎక్కువ అవుతుంది.
ఎడిపోజ్ కణజాలాన్నే మనం కొవ్వు అని పిలుస్తాం. ఈ కణజాలం శరీరంలో చర్మం కింది భాగంలో, వివిధ అవయవాల్లో, ఎముక మూలుగలో, కండరాల్లో, రొమ్ము దగ్గర పేరుకుపోతుంది. కొవ్వు పేరుకోవటం ఆరోగ్యపరంగా ఎన్నో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
వాటిలో కొన్ని…
పొట్ట కొవ్వు ఆరోగ్యకరమైన కణాల్లో క్యాన్సర్‌ను ప్రేరేపించే సైటోకైన్లను విడుదల చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడంతో అండాశయం కొవ్వు కణాలను విడుదల చేస్తుంది. దీంతో బరువు ఎక్కువున్న స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పురుషుల్లోనూ క్యాన్సర్ల ముప్పు ఎక్కువే.
బానపొట్ట, మెడ చుట్టూ కొవ్వు ఉంటే గురక, నిద్రలో శ్వాసకు అవరోధాలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు, శ్వాస
నాళాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో శ్వాసక్రియ కష్టం అవుతుంది. దీనివల్ల నిద్ర క్రమం దెబ్బతింటుంది. ఫలితంగా రోజంతా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి నిద్రఅసలే పట్టకపోవచ్చు కూడా.
రక్తంలో చక్కెర స్థాయులు, ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే రక్తపోటు దాడి చేయవచ్చు.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు తలెత్తుతాయి. ఇది కుంగుబాటుకు దారితీస్తుంది.