Dry Ginger | శొంఠి గురించి అందరికీ తెలిసిందే. ఇది మన వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉంది. అల్లాన్ని ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తారు. దీంతో శొంఠిలో అనేక ఔషధ విలువలు పెరుగుతాయి. ఆయుర్వేద ప్రకారం శొంఠి మనకు అనేక లాభాలను అందిస్తుంది. శొంఠిని ఉపయోగించి పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గాను భిన్న రకాలుగా శొంఠిని ఉపయోగిస్తారు. శొంఠి మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కనుక దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. శొంఠిని వాడితే అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో జింజరాల్స్, షోగోల్స్ అనబడే శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సాధారణ అల్లంలో కన్నా శొంఠిలోనే అధికంగా ఉంటాయి. కనుక శొంఠిని వాడితే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే వాపులు కూడా తగ్గుతాయి.
శొంఠిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు జరుగుతుంది. శొంఠిలో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే జీర్ణ వ్యవస్థలోని గ్యాస్ మొత్తం బయటకు పోతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తగ్గుతాయి. ప్రయాణ సమయాల్లో వాంతులు అవకుండా అడ్డుకోవచ్చు. శొంఠిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల శరీరంలోని అనేక భాగాల్లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కండరాల నొప్పులు, స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులు, తలనొప్పి వంటి అనేక రకాల నొప్పుల నుంచి శొంఠి అద్బుతమైన ఉపశమనాన్ని అందిస్తుంది. శొంఠిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.
శొంఠిని తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శొంఠి దగ్గు, జలుబు, గొంతులో నొప్పి, గరగర, మంట వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠిని తీసుకుంటే గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శొంఠిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి, కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. శొంఠిని తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. శొంఠిలో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
శొంఠిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుందని, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుందని పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. దీంతో ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శొంఠి ఘాటుగా ఉంటుంది కనుక దీన్ని నేరుగా తినలేరు. అందుకని దీన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా పాలలో శొంఠి పొడి కలిపి రాత్రి పూట నిద్రకు ముందు తాగవచ్చు. లేదా శొంఠి పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని భోజనంలో మొదటి ముద్దలో కలిపి తినవచ్చు. ఇలా శొంఠి మనకు అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది.