Turmeric Tea | పసుపును నిత్యం మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. పసుపు వల్ల వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. ఆయుర్వేదంలోనూ పసుపుకు ఎంతగానో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. పసుపు ఔషధాలకు గని అని కూడా చెబుతుంటారు. మనకు కలిగే ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి పసుపుకు ఉంటుంది. అయితే పసుపును తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు, కాన్నీ దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. రాత్రి పూట పసుపును పాలలో కలిపి తీసుకోవచ్చు. అయితే పాలు తాగలేం అనుకునేవారు గోరు వెచ్చని నీటిలోనూ పసుపును కలిపి తాగవచ్చు. పసుపును ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అనేక రోగాలను ఇది తగ్గిస్తుందని వారు అంటున్నారు.
పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీని వల్ల రాత్రపూట నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట పసుపు నీళ్లను తాగితే మన శరీరంలో సెరొటోనిన్, డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మూడ్‌ను మారుస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కర్క్యుమిన్ వల్ల మెలటోనిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని తేలింది. ఇది నిద్రను నియంత్రించే హార్మోన్. కనుక రాత్రి పూట పసుపు టీని సేవిస్తుంటే మైండ్, శరీరం రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి ఉన్నవారికి పసుపు టీని దివ్యౌషధంగా చెప్పవచ్చు.
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ పదార్థంగా పనిచేస్తుంది. ఇది తీవ్రమైన వాపులు, నొప్పులను సైతం తగ్గిస్తుంది. రాత్రి పూట చాలా మందికి నొప్పులు ఉంటాయి. కొందరిలో వాపులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలాంటి వారికి రాత్రి పూట నిద్ర కూడా సరిగ్గా ఉండదు. కనుక వారు పసుపు టీని సేవిస్తుండాలి. దీంతో నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పసుపు టీని సేవిస్తుంటే పైత్య రసం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు సులభంగా జీర్ణం అవుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు జీర్ణాశయ పొర వాపులకు గురి కావడాన్ని తగ్గిస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట నిద్రకు ముందు పసుపు టీని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆ వ్యవస్థను అది మెరుగు పరుస్తుంది.
పసుపులో ఉండే కర్క్యుమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. దీంతో శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రాత్రి పూట పసుపు టీని సేవిస్తుంటే శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. పాతకణాల స్థానంలో కొత్త కణాలు వస్తాయి. దీంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. లివర్ ఆరోగ్యానికి కూడా పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపు టీని రోజూ రాత్రి పూట సేవిస్తుంటే లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోయి లివర్ శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా రాత్రి పూట పసుపు టీని తాగుతుండడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.