Tomato Juice | టొమాటోలను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటిని అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. టొమాటోలు లేకుండా మనం ఏ కూరను పూర్తి చేయం అంటే అతిశయోక్తి కాదు. నిత్యం మనం చేసే అనేక కూరల్లో టొమాటోలను వేస్తుంటారు. టొమాటోలను వేస్తే కూరలకు మంచి రుచి వస్తుంది. కూరలు చిక్కగా కూడా కనిపిస్తాయి. అయితే టొమాటోలను రోజూ గ్రీన్ సలాడ్ రూపంలో పచ్చిగా కూడా తినవచ్చు. లేదా ఉదయం పరగడుపునే టొమాటో జ్యూస్‌ను ఒక కప్పు మోతాదులో కూడా సేవించవచ్చు. టొమాటోలను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల మన శరీరానికి కలిగే మేలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటోలలో విటమిన సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే టొమాటోలలో విటమిన్ ఎ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ టొమాటో జ్యూస్‌ను తాగుతుంటే ఫలితం ఉంటుంది. టొమాటోలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి. టొమాటోలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు రోజూ టొమాటో జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
టొమాటో జ్యూస్‌ను తాగితే అందులో ఉండే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. టొమాటోలలో ఉండే మెగ్నిషియం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. కండరాలు రిలాక్స్ అయ్యేట్లు చేస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గుతాయి. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు టొమాటో జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. అలాగే రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను రోజూ తాగితే ఎంతగానో ఫలితం ఉంటుంది.
టొమాటోలలో ఉండే లైకోపీన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీని వల్ల హార్ట్ స్ట్రోక్స్ రాకుండా అడ్డుకోవచ్చు. టొమాటోలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. పొట్టంతా క్లీన్ అవుతుంది. టొమాటోలలో ఉండే లైకోపీన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. దీని వల్ల సూర్య కిరణాల నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తగ్గుతాయి. ఇలా టొమాటో జ్యూస్‌ను రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.