Copper Vessel Water | పూర్వం ఒకప్పుడు మన ఇళ్లలో కేవలం రాగి పాత్రల్లోని నీటినే తాగేవారు. కానీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్‌ను నీటి కోసం ఉపయోగిస్తున్నాం. వీటి వల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. కానీ ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం ఆరోగ్యకరం కాదని ఆయుర్వేదం చెబుతోంది. రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ ఉంచిన నీళ్లను రోజూ ఉదయం కనీసం ఒక సారి అయినా సరే తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాగి పాత్రలో నీళ్లను ఉంచితే అసలు ఏం జరుగుతుంది..? అంటే.. రాగి పాత్రలో ఒక రాత్రంతా లేదా సుమారుగా 12 గంటల పాటు నీళ్లను నిల్వ ఉంచితే ఆ నీటిలోకి రాగి అణువులు చేరుతాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే ఆ నీటికి చెందిన ఆల్కలైన్ స్వభావం పెరుగుతుంది. అలాంటి నీళ్లను తాగితే మన శరీర పీహెచ్ విలువ సమ స్థాయిలో ఉంటుంది. దీంతో రోగాలు రాకుండా రక్షించుకోవచ్చు.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచడం వల్ల ఆ నీళ్లలోకి చేరే రాగి అణువులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ నీరు జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. రాగి పాత్రలో ఉంచిన నీళ్లను సేవించడం వల్ల శరీరానికి రాగి సమృద్ధిగా లభిస్తుంది. ఇది అనేక జీవక్రియలను సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. రాగి పాత్రలోని నీళ్లను తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది. చర్మం తేమగా ఉంటుంది. చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
రాగి పాత్రలో రాత్రంతా నిల్వ ఉంచిన నీళ్లను ఉదయం తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా రాగి నీళ్లను సేవించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో ఉంచి నీళ్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములను నిర్మూలిస్తాయి. దీంతో రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటాము.
రాగి పాత్రలోని నీటిని తాగడం శ్రేయస్కరమే అయినప్పటికీ రాగి పాత్రలను తరచూ శుభ్రం చేస్తుండాలి. లేదంటే పాత్రలో అడుగు భాగంలో నాచులా పేరుకుపోతుంది. అలాంటి నీళ్లను తాగితే వ్యాధులు వస్తాయి. కనుక రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచి తాగాలనుకునే వారు కచ్చితంగా ఈ సూచనను పాటించాలి. కొందరికి రాగి నీళ్లను సేవిస్తే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ నీళ్లను తాగకూడదు. అలాగే కొందరికి కాపర్ పడదు. అలాంటి వారు కూడా ఈ నీళ్లను సేవించకూడదు.