నోరు ఆరోగ్యంగా ఉంటే.. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నట్టేనని వైద్యులు చెబుతారు. నోటిలో రుగ్మతలు ఉన్నప్పుడు.. ఆ నొప్పి నోటి కండరాలకే పరిమితమైనా, సమస్య మాత్రం మెదడుదాకా పాకుతుందని హెచ్చరిస్తారు. మనం తీసుకునే ఆహారం జీర్ణాశయానికి చేరడం, జీర్ణం కావడం తెలిసిందే. జీర్ణ వ్యవస్థలో భాగమైన నోటిలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు చేరతాయి. ప్రతి ఉదయం పళ్లు తోముకోవడం, తిన్న తర్వాత నీళ్లతో పుక్కిలించడం వల్ల ఆయా బ్యాక్టీరియాల ప్రభా వాన్ని తప్పించుకోవచ్చు. అయినా అప్పుడప్పుడూ పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పిని భరిస్తూ, చికిత్స వాయిదా వేసేవాళ్లు మాత్రం కాస్త ఆలోచించాలి.
ఆహారం తిన్న తర్వాత నోటిలోనే మిగిలిపోయే పదార్థాల సాయంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. చాలా మందిలో పళ్లు పుచ్చి పోవడం, చిగుళ్ల గాయాల వల్ల రక్తస్రావం లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారిలో చెడు బ్యాక్టీరియా గాయాల ద్వారా రక్తనాళాల్లోకి చేరుతుంది. రక్తప్రవాహంలోకి చేరడమంటే శరీర భాగాలన్నిటికీ చేరుకోవడమే. అంతేకాదు, మెదడు కణజాలంలో భాగమై నాడీ సంబంధమైన సమస్యలకు కారణం అవుతుంది. అంతిమంగా, వివిధ అవయవాల్లో చేరి వాటి పని
తీరునూ మారుస్తుంది. అందువల్ల, నోటిలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం, అల్జీమర్స్ వరకూ వెళ్లొచ్చని హెచ్చరిస్తున్నారు.