Unhealthy Foods | బయట రహదారుల పక్కన బండ్లపై లేదా బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులలో మనకు నోరూరించే జంక్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. అనేక రకాల నూనె పదార్థాలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ మనకు నోట్లో నీళ్లు ఊరేలా చేస్తాయి. దీంతో రోడ్డు మీదుగా వెళ్తున్నప్పుడు సహజంగానే వాటి వాసనకు ఆకర్షితులమవుతాం. దీంతో అవసరం లేకున్నా మనం జంక్ ఫుడ్ వైపు వెళ్లి లాగించేస్తాం. అయితే జంక్ ఫుడ్‌ను ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ కొందరు రోజూ అదొక ఉద్యమంలా తింటుంటారు. జంక్ ఫుడ్‌ను ఇలా తరచూ తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది తరచూ తినే అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టమే. కానీ పానీ పూరీ విక్రయించే వారు మాత్రం అంత శుభ్రతను మెయింటెయిన్ చేయరు. పానీ పూరీలో ఇచ్చే నీళ్లు అపరిశుభ్రంగా ఉంటాయి. పానీ పూరీలను తయారు చేసేందుకు కూడా సరైన నూనెను ఉపయోగించరు. అలాగే అపరిశుభ్రమైన వాతావరణంలో పానీ పూరీలను అందిస్తుంటారు. ఇలా పానీ పూరీల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పానీ పూరీలను తింటే ఇన్ఫెక్షన్లకు గురవుతారు. పుడ్ పాయిజనింగ్ అవుతుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కనుక పానీ పూరీలను తినేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.
బటర్ చికెన్‌ను చూస్తేనే నోరూరిపోతుంది. దీని రుచికి ఫిదా కాని వారు ఎవరూ ఉండరు. నాన్‌తో కలిపి దీన్ని తింటారు. టేస్ట్ అదిరిపోతుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే బటర్ చికెన్ మనకు అత్యంత అనారోగ్యాన్ని కలగజేస్తుంది. రుచిగా ఉన్నప్పటికీ దీన్ని తింటే క్యాలరీలు అధికంగా చేరుతాయి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇది హైబీపీ, గుండె జబ్బులకు కారణమవుతుంది. కనుక బటర్ చికెన్ తింటున్నవారు దాని పట్ల మక్కువను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పావ్ భాజీ మనకు ముంబైలోనే కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా లభిస్తోంది. బ్రెడ్, వివిధ రకాల కూరగాయలతో చేసే కర్రీని ఇస్తారు. అయితే ఈ ఫుడ్ కూడా అనారోగ్యకరమైన ఆహారాల కిందకు వస్తుంది. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను కలగజేస్తుంది.
సమోసాలు అంటే చాలా మందికి ఇష్టమే. రకరకాల సమోసాలను చాలా మంది తరచూ తింటుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం సమోసాలు అనారోగ్యకరమైన ఆహారాల జాబితా కిందకు చెందుతాయి. ఎందుకంటే పదే పదే కాగిన వేడి నూనెలో సమోసాలను తయారు చేస్తారు. వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేస్తాయి. కాబట్టి తరచూ సమోసాలను తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే బయట రహదారుల పక్కన బండ్లపై లభించే జిలేబీ కూడా అనారోగ్యకరమైన ఆహారమే. ఇందులోనూ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా స్వీట్ షాపుల్లో లభించే కచోరీ, బయట బండ్లపై లభించే లస్సీ వంటివి కూడా ఫ్యాట్‌ను అధికంగా కలిగి ఉంటాయి. కనుక వీటిని తరచూ తీసుకుంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే గుండె జబ్బులు వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.