Blood Donation | రక్తం మన శరీరానికి ఇంధనం లాంటిది. ఒక వాహనంలో ఎంత నాణ్యమైన ఇంధనం పోస్తే ఆ వాహనం ఎంత నాణ్యంగా, మన్నికగా నడుస్తుందో, మన శరీరంలో ప్రవహించే రక్తం కూడా వ్యర్థాలు, టాక్సిన్లు లేకుండా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాలు రాకుండా ఉంటాయి. రక్తం మనకు ఇంధనంగానే కాక శరీర భాగాలకు పోషకాలను, ఆక్సిజన్‌ను అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వ్యాధి నిర్దారణ కోసం ముందుగా రక్త పరీక్షలనే చేస్తారు. రక్తాన్ని పరీక్షించడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. ఇలా మన శరీరంలో రక్తం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమకు కావల్సిన రక్తం సరైన సమయానికి అందక ప్రాణాలను కోల్పోతున్నారు.
పలు రకాల వ్యాధుల బారిన పడిన వారితోపాటు సర్జరీలు చేయించుకునే వారికి కూడా అధిక మొత్తంలో రక్తం అవసరం అవుతుంది. అందుకు గాను బ్లడ్ బ్యాంకులు పనిచేస్తాయి. కావల్సిన రక్తాన్ని అందిస్తాయి. అయితే రేర్ బ్లడ్ గ్రూప్స్ అయితే రక్తం లభించడం కష్టమవుతుంది. దీంతో రోగికి చికిత్స అందించడం, ప్రాణాలను నిలబెట్టడం కష్టమవుతుంది. కనుకనే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చెబుతుంటారు. అయితే రక్తదానం అంటే శరీరంలో ఉన్న శక్తిని అంతా కోల్పోయినట్లుగా కొందరు ఫీలవుతారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే రక్తదానం చేస్తే శక్తిని కోల్పోరు సరికదా, కొత్త శక్తి వస్తుంది. అలాగే పలు లాభాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్తగా రక్తం తయారవుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. తరచూ రక్తదానం చేసేవారికి హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. కాబట్టి రక్తదానం చేస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రక్తదానం చేయడం వల్ల రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడవు. కొందరికి రక్తం మరీ చిక్కగా ఉండడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడుతాయి. దీన్ని నివారించేందుకు రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతారు. అయితే ఇలాంటి వారు తరచూ రక్తదానం చేస్తుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తం పలుచగా మారడమే కాదు, రక్త నాళాల్లో ఏర్పడే క్లాట్స్ కరిగిపోతాయని, దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చని అంటున్నారు.
రక్తదానం తరచూ చేయడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో కణాలు కొత్తగా ఏర్పడుతాయి. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. రక్తదానంతో క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తరచూ రక్తదానం చేసే వారి రక్తం శుభ్రంగా ఉంటుందని తేలింది. రక్తంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. అలాగే శరీరం డిటాక్స్ అవుతుందని అంటున్నారు. రక్తదానం చేస్తుంటే శరీరంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. రక్తదానం చేయడం వల్ల సుమారుగా 600 క్యాలరీల వరకు ఖర్చవుతాయని అధ్యయనాల ద్వారా తేలింది. అందువల్ల తరచూ రక్తదానం చేస్తుంటే అధిక బరువు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. కాబట్టి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, దీంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.