Cucumber Seeds | కీరదోసకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా మంది వీటిని కేవలం వేసవి కాలంలోనే తింటారు. కీరదోసకాయలను తింటే శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. నీరు లభిస్తుంది. శరీరంలోని వేడి తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అయితే కీరదోసకాయలు మాత్రమే కాదు, వాటిల్లో ఉండే విత్తనాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఈ విత్తనాలను తీసి తింటారు. కానీ వీటిని పడేయకూడదు. ఇవి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కీరదోస విత్తనాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ విత్తనాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే విటమిన్లు కె, సి, బి1, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మాంగనీస్, క్యాల్షియం, ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, ఇతర ఫినోలిక్ సమ్మేళనాలు ఈ విత్తనాల్లో అధికంగా ఉంటాయి. అందువల్ల కీరదోస విత్తనాలను తింటే పోషకాలు అనేకం లభిస్తాయి. పోషకాహార లోపం తగ్గుతుంది.
ఈ విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఈ విత్తనాలు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. దీనివల్ల జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. కీరదోస విత్తనాలను తింటే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. పొట్టలో ఏర్పడిన అసౌకర్యం సైతం తగ్గుతుంది. ఈ విత్తనాల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
కీరదోస విత్తనాల్లో సైతం అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఈ విత్తనాలను తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరంలోని వేడిపోయి చల్లగా మారుతుంది. వేడి శరీరం ఉన్నవారికి ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతాయి. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా ఉంటారు.
కీరదోస విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణం వల్ల ఈ విత్తనాలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కీరదోస విత్తనాల్లో విటమిన్ ఇ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మానికి కావల్సిన తేమ లభించి మృదువుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారికి మేలు జరుగుతుంది. చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా కీరదోస విత్తనాలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.