Nalleru | మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు మొక్కలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ చాలా వరకు ఔషధ మొక్కల గురించి ఇంకా మనకు తెలియదు. అలాంటి మొక్కల్లో నల్లేరు కూడా ఒకటి. ఇది చూసేందుకు కాడల మాదిరిగా ఉంటుంది. ముళ్ల మొక్క అని దీన్ని భావిస్తారు. కానీ ఇది అందించే ఔషధ గుణాలు మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఆయుర్వేదంలో నల్లేరుకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీన్ని అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. నల్లేరు కాడలను శుభ్రం చేసి వాటితో కూర, పచ్చడి కూడా చేస్తుంటారు. నల్లేరును ఇలా కూర రూపంలో తీసుకోవచ్చు. లేదా వీటి రసం కూడా తాగవచ్చు. నల్లేరు వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో నల్లేరు అద్భుతంగా పనిచేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు నల్లేరును రోజూ తింటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వృద్దాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎముకలు బలంగా ఉండి ఆర్థరైటిస్ నొప్పులు, వాపులు రాకుండా ఉంటాయి. ఎముకల నొప్పి ఉన్నవారు కూడా నల్లేరును తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. నల్లేరులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల నల్లేరు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాడలను తింటుంటే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గౌట్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్లేరు మన శరీరంలోని కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మన శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణం అయ్యే లైపేజ్, అమైలేజ్ అనే ఎంజైమ్‌ల పనితీరును నల్లేరు అడ్డుకుంటుంది. దీంతో శరీరంలో కొవ్వు చేరదు. పైగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్లేరును తీసుకోవడం వల్ల కొన్ని రోజులకు వ్యక్తుల బీఎంఐ, నడుము చుట్టుకొలత తగ్గాయని తేలింది. కనుక నల్లేరును ఆహారంలో భాగం చేసుకుంటే కొవ్వును కరిగించుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
నల్లేరులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. నల్లేరును తినడం వల్ల షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. నల్లేరులో హైపోగ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. కనుక షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. నల్లేరులో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా నల్లేరు వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నల్లేరును తింటే కొందరికి పడదు. అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అలర్జీలు ఉన్నవారు నల్లేరును తినకపోవడమే మంచిది.