Garam Masala Powder | వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కొన్ని రకాల ప్రత్యేకమైన వంటకాలకు మసాలా అవసరం అవుతుంది. మసాలా వేయకపోతే ఆయా వంటకాలకు రుచి రాదు. వంటకాలకు రుచిని అందించడంలో మసాలాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలోనే వంటలను బట్టి కొందరు భిన్నమైన మసాలాలను ఉపయోగిస్తారు. అయితే అన్నింటిల్లోకెల్లా గరం మసాలాను అధిక శాతం మంది ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం వెజ్ వంటకాలకు మాత్రమే కాకుండా నాన్ వెజ్ వంటకాలకు కూడా కామన్‌గా ఉపయోగపడుతుంది. అద్భుతమైన రుచి, సువాసనను అందిస్తుంది. గరం మసాలాను వంటల్లో వేస్తే అప్పుడు వచ్చే వాసనకే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం గరం మసాలా పొడి మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. దీన్ని వంటల్లో వాడడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
గరం మసాలా పొడిలో అనేక మసాలా దినుసులు కలిసి ఉంటాయి. జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, జాజికాయ వంటి మసాలా దినుసులతో గరం మసాలా పొడిని తయారు చేస్తారు. ఇవన్నీ ఆయుర్వేద ప్రకారం ఎన్నో ఔషధ గుణాలను, పోషక విలువలను కలిగి ఉంటాయి. కనుక గరం మసాలా పొడి కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మసాలా కనుక అప్పుడప్పుడు వాడాలి. తరచూ వాడితే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే దీన్ని మోతాదులో అప్పుడప్పుడు వాడితే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గరం మసాలా పొడిని మరీ అధికంగా వాడితే అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. కానీ దీన్ని తక్కువ మోతాదులో ఉపయోగిస్తే అదే జీర్ణ సమస్యలను తగ్గించే ఔషధంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే గరం మసాలా పొడి వల్ల అనేక జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, పొట్టలోని అసౌకర్యం తొలగిపోతాయి.
గరం మసాలా పొడిని వాడుతుంటే జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మనం తినే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. గరం మసాలా పొడిలో అనేక రకాల మసాలా దినుసులు ఉంటాయి కనుక దీన్ని వాడితే అనేక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. గరం మసాలా పొడి థర్మోజెనెసిస్ అనే ప్రక్రియను కలగజేస్తుంది. అంటే శరీరానికి వేడిని అందిస్తుందన్నమాట. ఈ క్రమంలో ఈ పొడిని చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. చలి నుంచి రక్షణ లభిస్తుంది.
గరం మసాలా పొడి వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఈ పొడి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక కీళ్లు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్ ఉన్నవారికి ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఈ పొడిలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్ వంటి మినరల్స్‌ను పొందవచ్చు. ఇలా గరంమసాలా పొడి మనకు అనేక లాభాలను అందిస్తుంది. కానీ దీన్ని మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.