Amaranth Leaves | మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. ఇది మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని సీజన్లలోనూ ఎప్పుడంటే అప్పుడు లభిస్తుంది. పైగా చవకగా కూడా ఉంటుంది. అయితే ఇతర ఆకుకూరలను తిన్నట్లుగా తోటకూరను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. తోటకూరతో పప్పు, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. దీన్ని కిచిడీ వంటి ఆహారాల్లోనూ వేసి వండుకోవచ్చు. తోటకూరను సరిగ్గా వండాలే కానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే తోటకూరను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం విడిచిపెట్టకుండా తింటారు. తోటకూరలో మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. రోగాల బారి నుంచి రక్షిస్తాయి. ఈ క్రమంలోనే తరచూ తోటకూరను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తోటకూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి తోటకూర ఒక వరమనే చెప్పవచ్చు. దీంతో బీపీని కంట్రోల్లో ఉంచుకోవడంతోపాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. తోటకూరను తరచూ తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. వాపులు రాకుండా చూస్తాయి. దీంతోపాటు ఆక్సీకరణ ఒత్తిడిని తక్కువ చేస్తాయి. దీని వల్ల ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
తోటకూరలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. రేచీకటి సమస్య ఉన్నవారు, కంటి చూపు స్పష్టంగా లేని వారు తరచూ తోటకూరను తింటుండాలి. దీంతో కంటి చూపు పెరగడంతోపాటు ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్ వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా నిరోధిస్తాయి. దీంతో కళ్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాయి. తోటకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ముఖ్యంగా అజీర్తి బాధించదు. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తోటకూరలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గిస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేందుకు సహాయ పడుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. తోటకూరలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ తగ్గేందుకు దోహదం చేస్తాయి. తోటకూరలో ఉండే విటమిన్ ఎ, సి, కె శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటకూరను తినడం వల్ల కణాలకు మరమ్మత్తు జరుగుతుంది. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. తోటకూరలో విటమిన్ కె, క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. తోటకూరను తింటే ఐరన్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది. ఇది రక్తహీనతను పోగొడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక తోటకూర కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని తినండి.