Brisk Walking | ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. వైద్యులు చెబుతున్న ప్రకారం వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అంటే 2 రోజులు విరామం తీసుకున్నా 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాయామం అంటే భారీ బరువులను ఎత్తాల్సిన పనిలేదు. కఠినమైన ఎక్సర్‌సైజ్‌లను చేయాల్సిన పనిలేదు. కేవలం వాకింగ్ చేస్తే చాలు. దీంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. దీనికి ఎలాంటి ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. అయితే వాకింగ్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో బ్రిస్క్ వాకింగ్ కూడా ఒకటి. అంటే మీరు సాధారణంగా నడిచే నడకనే కాస్త ఎక్కువ వేగంగా నడవాలన్నమాట. మీరు నడిచే క్రమంలో మీ చేతులను కూడా లయబద్దంగా ఆడించాల్సి ఉంటుంది. దీన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఇది అనేక అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. దీని వల్ల గుండె కండరాలు ఆరోగ్యంగా మారుతాయి. దృఢంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల సాధారణ వాకింగ్ కన్నా అధిక మొత్తంలో క్యాలరీలను త్వరగా ఖర్చు చేయవచ్చు. దీంతో బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ వాకింగ్ వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎముకలు పెళుసుగా మారకుండా ఉంటాయి. అలాగే కాళ్లు, చేతులు, ఇతర భాగాల్లో ఉండే కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
బ్రిస్క్ వాకింగ్ వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గిస్తాయి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లలో గుజ్జు సరిగ్గా నిర్వహించబడుతుంది. దీంతో వృద్ధాప్యంలో కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ రాకుండా చూసుకోవచ్చు.
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు మరింత గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగించుకుంటాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. డయాబెటిస్ లేకున్నా కూడా ఈ వాకింగ్ చేస్తే ఆ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. ఇక సాధారణ వాకింగ్‌ను గంటకు 3 లేదా 4 కిలోమీటర్ల స్పీడ్ చొప్పన చేస్తారు. అదే బ్రిస్క్ వాకింగ్ అయితే గంటకు కనీసం 5 లేదా 6 కిలోమీటర్ల స్పీడ్ చొప్పున చేయాల్సి ఉంటుంది. మీకు బయట ఇలా వాకింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటే జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై లేదా ఇంట్లోనూ ట్రెడ్ మిల్‌పై ఇలా స్పీడ్ సెట్ చేసుకుని వాకింగ్ చేయవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.