చక్కెర వ్యాధి.. దీని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది.మారిన జీవనశైలి, ఆహార వ్యవహారాల వల్ల ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా మధుమేహానికి మనదేశం ప్రపంచవ్యాప్తంగా రాజధానిగా మారింది. ఇతర దేశాల కంటే అత్యధికంగామనదేశంలో మధుమేహ రోగులు ఉండటమే అందుకు కారణం! అవగాహనా లేమితో రోజురోజుకు షుగర్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న దృష్ట్యా ఏటా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసలు మధుమేహం అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వచ్చిన తరువాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితర అంశాలపై నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మధుమేహం మనిషిని మహా మోసం చేస్తుంది. చాపకింద నీరులా ఒళ్లంతా పాకి, శరీరాన్ని కుదేలు చేసిన తర్వాత గానీ బయటపడదు. ఈ వ్యాధి తీవ్రత పెరిగే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులూ కనిపించవు. ఫలితంగా వ్యాధిని రోగి గుర్తించే వీలు ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యాధి బయటపడుతుంది. అంటే రోగికి ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు గానీ, శస్త్రచికిత్సలు చేసే సమయంలో గానీ మధుమేహం ఉందని తెలుస్తుంది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందుకే, దీనిని వైద్య పరిభాషలో స్వీట్ పాయిజన్‌గా పరిగణిస్తారు.
ఈ కారణంగానే చాలామంది రోగులు మొదటి మూడు దశలు దాటి డేంజర్ జోన్లోకి వచ్చేస్తున్నారు. వ్యాధి ప్రారంభ దశలో అంటే మూడు స్టేజీల్లోపు ఉంటే దానిని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే అంచనావేసి, రాకుండా అరికట్టవచ్చు అని భరోసా ఇస్తున్నారు. కానీ, 80 శాతం మంది రోగుల్లో మూడు దశల తరువాతనే వ్యాధి ఉన్నట్లు బయట పడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం.
రక్తంలో చక్కెర స్థాయి..
మధుమేహం అనేది శరీరంలో మూడు రకాల పదార్థాలు పెరగడం వల్ల వస్తుంది. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణ చక్కెరలుగా పిలుస్తారు. ఇవి మనం తినే ఆహారంలో ఉండి తీపిని అందిస్తాయి. సాధారణంగా శరీరం పలు రకాల సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయితే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ‘ప్యాంక్రియాటిక్ బీటా’ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. విడుదలైన ఇన్సులిన్ సమక్షంలో బీటా కణాలు.. శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లలో, తీపి పానియాలు, చల్లని పానియాలలో లభిస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఉబకాయం, కాలేయంలో కొవ్వు, ఇన్సూలిన్ నిల్వలు పెరుగుతాయి. సుక్రోజ్ మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ మూడు పదార్ధాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలను అంటే శక్తిని విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా శక్తి విడుదల కావడంతో అది కొవ్వుగా మారి పేరుకుపోతుంది. ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతోపాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఉబకాయం కూడా ఏర్పడుతుంది. శరీరంలో తీపి పదార్ధాల వల్ల అధిక శక్తి విడుదల అవుతున్నందున ఈ రుగ్మతను.. చక్కెర వ్యాధి అనీ, మధుమేహం అనీ అంటారు.
రకాలు రెండు..
ప్రధానంగా డయాబెటిక్ రెండు రకాలు. ఒకటి టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. ఎక్కువ మందిలో కనిపించేది టైప్-2 డయాబెటిసే. హార్మోనల్ మార్పుల వల్ల కొంతమంది గర్భిణుల్లో షుగర్ స్థాయులు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈవిధంగా గర్భం సమయంలో డయాబెటిక్ రావడాన్ని గెస్టేషనల్ డయాబెటిక్ అంటారు.
టైప్-1: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై పొరపాటున దాడి చేసి, వాటిని నాశనం చేస్తుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. టైప్-1 డయాబెటిస్‌కు కచ్చితమైన కారణాలు చెప్పలేం. జన్యుపరంగా, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు.
టైప్-2: ఇది సర్వసాధారణమైనది. అంటే ప్రస్తుతం ఉన్న డయాబెటిస్ రోగుల్లో 90 శాతం మంది టైప్-2కు చెందినవాళ్లే! జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇది వస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమగ్రంగా వినియోగం కాకపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. అంతేకాకుండా ఊబకాయం వల్ల కూడా ఇది సంభవిస్తుంది.
గెస్టేషనల్ డయాబెటిక్: సాధారణంగా గర్భం దాల్చిన మహిళల్లో హార్మోన్ల మార్పు వల్ల ఈ తరహా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రసవం తరువాత 90 శాతం మందికి షుగర్ స్థాయులు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
మందుల వల్ల కూడా : అయితే కొంతమందికి మాత్రం హార్మోన్ల అసమతుల్యత, మందుల కారణంగా కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
Diabetes
ప్రభావితమయ్యే అవయవాలు
సాధారణంగా ఉండాల్సిన చక్కెర స్థాయులు: పరిగడుపున (అల్పహారానికి ముందు).. 100 కంటే తక్కువ భోజనం చేసిన రెండు గంటల్లోపు.. 140
ఎప్పుడు షుగర్ ఉందనుకోవాలి?
అల్పహారానికి ముందు (పరిగడుపున) షుగర్ లెవల్స్ 126 కన్నా ఎక్కువగా ఉండి, భోజనం తరువాత 200 కంటే అధికంగా ఉంటే షుగర్ ఉన్నట్టు. వారిని మధుమేహ రోగులుగా భావించి మందులు సూచించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నవారు అంటే అల్పహారానికి ముందు 100 కంటే ఎక్కువగా ఉండి 126 లోపు, భోజనం తరువాత 140 కంటే ఎక్కువగా 200 లోపు ఉంటే వారికి షుగర్ వచ్చే సూచనలున్నట్లు పరిగణిస్తారు. దీనిని ప్రీ-డయాబెటిక్ అంటారు. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే షుగర్ లెవల్స్‌ను నియంత్రించే చికిత్స అందించి, వ్యాధి దరిచేరకుండా చూస్తారు. అంతేకాకుండా హిమోగ్లోబలిన్ ఏ1సీ పరీక్షల ద్వారా కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ పరీక్షలో చక్కెర స్థాయి 5.7 శాతం లోపు ఉండాలి. 5.7 నుంచి 6.4 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నారని గుర్తించాలి. 6.5 శాతం దాటితే వారిని డయాబెటిస్ రోగులుగా పరిగణిస్తారు.
చికిత్సా పద్ధతులు
డయాబెటిక్ రోగులకు సంబంధించిన మందులు, ఇన్సులిన్ తదితర చికిత్స అనేది వ్యాధి దశ, రకంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టైప్-1 డయాబెటిక్ రోగుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఉండదు. అందువల్ల వారు జీవిత కాలం ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించేందుకు కొంతమంది రోగులు ఇతర మందులు కూడా వాడాలి. ఇక టైప్-2 డయాబెటిస్‌లో ప్రి-డయాబెటిక్స్ లేదా డయాబెటిక్ రోగుల జీవన విధానం, వ్యాయామం, వెయిట్ మేనేజ్మెంట్, డైట్‌తో బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించగలిగితే.. అలాంటి వారికి ప్రాథమికంగా మందుల అవసరం పడకపోవచ్చు. చక్కర స్థాయులు నియంత్రణలో లేని రోగులు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది. కాగా, మరికొంత మందికి జీవన విధానంలో మార్పులు, బరువు తగ్గడం, ఇన్సులిన్ సెన్సిటివిటిని మేనేజ్ చేసుకోవాలని సూచిస్తారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో మందుల మోతాదును తగ్గించడం లేదా నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, ఈ నిర్ణయాలు పూర్తిగా వైద్యుల సూచన మేరకు మాత్రమే జరగాలి. లేకపోతే ప్రమాదకరం.
షుగర్ రాకుండా..
ప్రి-డయాబిటిస్ దశలో గుర్తిస్తే..
వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తిస్తే దానిని రాకుండా నివారించవచ్చు. ఈ విధంగా వ్యాధి వచ్చే అవకాశాన్ని ‘ప్రీ-డయాబెటిస్’ దశ అంటారు. ఈ స్టేజీలో రోగి వైద్యులను సంప్రదిస్తే వ్యాధి దరిచేరకుండా పూర్తిగా నివారించే వీలు ఉంటుంది. ప్రీ-డయాబెటిస్‌గా నిర్ధారణ జరిగితే కనీసం ఆరునెలలకు ఒక్కసారైన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి వచ్చే అవకాశాలున్న వారు వెంటనే చికిత్స తీసుకుంటే రోగం రాకుండా అరికట్టవచ్చు.
Drink Water
వ్యాధి లక్షణాలు
..?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ రోహిణి కస్తూరి, ఎండీ
ఎండోక్రైనాలజిస్ట్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్