Detox Lungs | ప్రస్తుతం మనం కాలుష్య భరితమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. దీంతోపాటు పొగ తాగే వారి పక్కన ఉన్నా లేదా పొగ తాగినా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. అయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శ్వాస వ్యాయామాలు, ఇతర ఎక్సర్సైజ్లు చేయడం చాలా ముఖ్యమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఫుడ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరైన డైట్‌ను పాటిస్తే మన ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు, ఈ డైట్ వల్ల ఊపిరితిత్తులు క్లీన్ కూడా అవుతాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేసే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలి, కాలిఫ్లవర్, మొలకలు, క్యాబేజీ వంటి ఆహారాలలో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను డిటాక్స్ చేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తరచూ వంటల్లో వాడే అల్లం కూడా ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఊపిరితిత్తుల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
పసుపును మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలం డ్యామేజ్ అవకుండా రక్షిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అయి వాటిల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. రోజూ పసుపు కలిపిన పాలను రాత్రి పూట తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది. నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లను తింటున్నా కూడా ఊపిరితిత్తులను క్లీన్ చేసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాటెకిన్స్ అని పిలవబడే సమ్మేళనాలు గ్రీన్ టీలో అధికంగా ఉంటాయి. అందువల్ల గ్రీన్ టీని తాగితే ఊపిరితిత్తుల వాపులు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలు డ్యామేజ్ అవకుండా నివారించవచ్చు. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో యాంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరి తిత్తుల కణజాలం డ్యామేజ్ అవకుండా చూస్తాయి. దీంతోపాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకుంటుంటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి.