Daily 30 Minutes Of Walking | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు వేళకు భోజనం చేయాలి. అలాగే సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ కూడా ఉండాలి. అప్పుడే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. అకస్మాత్తుగా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. అయితే వ్యాయామం విషయానికి వస్తే అన్నింటిలోనూ వాకింగ్ ను ఉత్తమమైన వ్యాయామంగా చెప్పవచ్చు. దీన్ని ఏ వయస్సు వారైనా చేయవచ్చు. ఇందుకు డబ్బు వెచ్చించాల్సిన పనిలేదు. వాకింగ్ అనేది సహజసిద్ధమైన తేలికపాటి వ్యాయామం. ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది వ్యాయామం చేయడం లేదు. కానీ రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలని వైద్య నిపుణుల చెబుతున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్నవారికి వాకింగ్ ఉత్తమమైన వ్యాయామం అని చెప్పవచ్చు. వాకింగ్ చేయడం వల్ల ఎముకలు బలంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఎముకలు పెళుసు బారి విరిగిపోయే రిస్క్ తగ్గుతుంది. వృద్ధాప్యంలోనూ ఎముకలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. కనుక రోజూ వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు లేదా బరువును నియంత్రణలో ఉంచాలనుకునే వారు రోజూ వాకింగ్ చేస్తే మంచిది. 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేస్తే ఏకంగా 100 క్యాలరీలను కరిగించవచ్చు. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఉత్తమమైన వ్యాయామం కోసం చూస్తుంటే వారికి వాకింగ్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మూడ్ మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
వాకింగ్ చేయడం వల్ల కీళ్లు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా భాగాలు పట్టుకుపోయి నొప్పులు వచ్చే వారు వాకింగ్ చేస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో కీళ్లు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి వాపులు, నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా వాకింగ్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను సైతం శరీరం సులభంగా శోషించుకుంటుంది. వాకింగ్ చేయడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. వాకింగ్ చేస్తే నలుగురితోనూ సంబంధాలు మెరుగు పడుతాయి. సమాజంలోని ఇతర వ్యక్తులతో సత్సంబంధాలను నెలకొల్పవచ్చు. అలాగే వాకింగ్ అనేది చాలా తేలికపాటి వ్యాయామం కనుక ఎవరైనా దీన్ని చేయవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.