రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కేవలం మంచి అలవాటు మాత్రమే కాదు, గుండె ఆరోగ్యాన్ని కాపాడే కీలక అంశమని తాజా పరిశోధన వెల్లడించింది. ప్రతిరోజూ నిద్రపోయే సమయం మారుతూ ఉంటే భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం లాంటి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల ప్రమాదం దాదాపు రెండింతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఊలు పరిశోధకులు నిర్వహించారు. ఉత్తర ఫిన్లాండ్కు చెందిన 3,231 మంది 46 ఏండ్ల వయసు గల వ్యక్తులపై పరిశోధన చేశారు.
వారి నిద్ర అలవాట్లను ఒక వారం పాటు ప్రత్యేక యాక్టివిటీ మానిటర్లతో నమోదు చేసి, తర్వాత పదేండ్లకు పైగా వారి ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు. అధ్యయనంలో… ప్రతిరోజూ నిద్రపోయే సమయం మారుతూ, ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయినవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపించింది. అయితే లేచే సమయం కంటే, నిద్రపోయే సమయం క్రమబద్ధంగా ఉండటమే గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకమని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే రోజూ ఒకే సమయానికి పడుకోవడం, కనీసం 78 గంటలు నిద్రపోవడం, సెలవు రోజుల్లోనూ నిద్ర వేళను ఎక్కువగా మార్చకుండా ఉండటం వంటి చిన్న అలవాట్లు గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచగలవని నిపుణులు సూచిస్తున్నారు.