Cholesterol | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో గుండెజబ్బులు ఒకటి. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వ్యక్తులకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన సమస్య. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది శరీరంలోని ప్రతి కణంలో కనిపించే కొవ్వు పదార్థం (లిపిడ్). ఇది హార్మోన్ల ఉత్పత్తికి, విటమిన్-డీ ఉత్పత్తికి, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరం, కానీ దాని అధికం గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ పెరిగేందుకు అనేక కారణాలు ఉండొచ్చు. మెరుగైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని వ్యక్తులు హై కొలెస్ట్రాల్‌తో బాధపడే అవకాశం ఉంది.
జంక్ ఫుడ్స్ వంటి వాటిలో అధిక సంతప్త, ట్రాన్స్‌ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఆహారాలు, వేయించిన ఆహారాలు వంటి అసమతుల్య ఆహారాలు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. శారీరకంగా చురుకుగా లేకుంటే.. వ్యాయామం చేయకపోతే, చెడు కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతుంది. అధిక బరువు, ఊబకాయం, ధూమపానంతో పాటు మద్యపాన అలవాట్లు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పోషకాహారమైన ఆహారం చాలా కీలకమైంది. 80/20 విధానంతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. ఈ రూల్ ప్రకారం.. మీ ఆహారంలో 80శాతం ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే, తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర ఉన్న ఆహారం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించేందుకు 80శాతం చురుగ్గా ఉండాల్సిందే.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆఫీసులో ఎక్కువగా కూర్చోకుండా కొంత సమయం నడవాలి. అలాగే, 20శాతం మీకు నచ్చిన మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగకుండా ఉండేందుకు ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె, అవకాడో, అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఓట్ మీల్, తృణధాన్యాలు, ఆపిల్, బేరి, పప్పులు, ఆకుకూరలు తదితర ఫైబర్ అధికంగా ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. బిస్కెట్లు, చిప్స్, ఫాస్ట్-జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం మానాల్సిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కొలెస్ట్రాల్ పెరుగుదల గుండెకు మాత్రమే కాకుండా శరీరంలోని అనేక భాగాలకు కూడా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. యువత అధికంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా బాధితులుగా మారే అవకాశం ఉందా? 30 సంవత్సరాలు పైబడిన వారంతా తప్పనిసరిగా క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.