Chicken With Skin | ఒకప్పుడు ఇళ్లలో నాటు కోళ్లను అధికంగా పెంచేవారు. కనుక ఎప్పుడో ఒకసారి లేదా చుట్టాలు వచ్చినప్పుడు, పండుగల సమయంలో నాటు కోళ్లను కోసి కూర వండి తినేవారు. కానీ ఇప్పుడు వారం వారం, ఇంకా చెప్పుకొస్తే వారం మధ్యలోనే ఎప్పుడంటే అప్పుడు బ్రాయిలర్ చికెన్ తింటున్నారు. బ్రాయిలర్ చికెన్ ను చాలా మంది స్కిన్ లేకుండా తింటున్నారు. చికెన్ ను స్కిన్‌తో తినకూడదని, మంచిది కాదని కొందరు భావిస్తుంటారు. అందుకనే స్కిన్ లెస్ చికెన్‌ను తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నిజంగానే చికెన్‌ను స్కిన్‌తో తినకూడదా.. చికెన్‌ను స్కిన్‌తో సహా తింటే ఏమవుతుంది..? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్‌ను స్కిన్‌తో తినకూడదని, తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని అనుకోవడం వట్టి అపోహేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ స్కిన్లోనూ మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయని వారు అంటున్నారు. చికెన్ స్కిన్‌లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఓలియిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు జాబితాకు చెందుతుంది. అలాగే కొద్ది మొత్తంలో పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఈ రెండు రకాల కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. కనుక చికెన్‌ను స్కిన్‌తో సహా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
చికెన్ లో శాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. కానీ వీటితో పోలిస్తే ఆరోగ్యకరమైన కొవ్వులే ఎక్కువ. కనుక చికెన్‌ను స్కిన్‌తో సహా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చికెన్ బ్రెస్ట్ పీస్‌ను స్కిన్‌తో సహా తింటే స్కిన్లెస్ కన్నా 30 నుంచి 50 క్యాలరీలు మాత్రమే అధికంగా చేరుతాయి. అంతేకానీ చికెన్ స్కిన్‌ను తింటే పెద్ద ఎత్తున క్యాలరీలు చేరవు. ఇక చికెన్ స్కిన్‌లో కొల్లాజెన్ ఉంటుంది. ఇది మన చర్మం, శిరోజాలు, గోర్ల సంరక్షణ, పెరుగుదలకు సహాయం చేస్తుంది. దీంతో ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. చికెన్‌లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వుల కారణంగా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చికెన్‌ను స్కిన్‌తో తింటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. పైగా వంట వండే సమయంలో పోషకాలు ఎక్కువగా కోల్పోకుండా ఉంటాయి. అలాగే చికెన్ స్కిన్‌లో కొవ్వు ఉంటుంది కనుక అదనపు నూనె లేకుండానే చికెన్ వండవచ్చు. ఇది నూనె వాడకాన్ని తగ్గిస్తుంది. చికెన్‌ను స్కిన్‌తో సహా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అయితే చికెన్‌ను స్కిన్‌తో సహా తినడం ఆరోగ్యకరమే అయినప్పటికీ బరువు తగ్గాలనుకునే ప్లాన్‌లో ఉన్నవారు తినకూడదు. అధిక బరువు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు చికెన్‌ను స్కిన్‌తో సహా తినకూడదు. చికెన్ స్కిన్‌లో సోడియం అధికంగా ఉంటుంది కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తినకూడదు. అలాగే చికెన్‌ను వేపుడులా కాకుండా ఉడకబెట్టి మాత్రమే తినాలని, అప్పుడే మన శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయని, లేదంటే అనారోగ్యాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.