Cancer Treatment | క్యాన్సర్ వ్యాధికి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని పద్ధతుల్లో దుష్ప్రభావాలు అధికం. రోగిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తాయి. ఈ పరిమితిని అధిగమించేందుకు వచ్చిందే.. సైబర్ నైఫ్ టెక్నాలజీ.కోతలు ఉండవు కాబట్టి, కోలుకోడానికి ఎక్కువ సమయం పట్టదు.
క్యాన్సర్.. మనిషి జీవిత కాలాన్ని అమాంతం మింగేసే మహమ్మారి. ఏ రూపంలో దాడి చేసినా లక్ష్యం ఒకటే.. రోగి ప్రాణాలను హరించడం. ఆ దూకుడును అరికట్టడానికి సరికొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. రేడియేషన్ థెరపీలో భాగమైన ‘సైబర్ నైఫ్’ టెక్నాలజీ అందులో ఒకటి. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించినప్పుడు.. క్యాన్సర్ కణాలు చుట్టుముట్టిన భాగాన్ని, చుట్టూ ఉన్న కణజాలాన్ని, లింఫ్ గ్రంథుల్ని తొలగించడం ద్వారా రుగ్మతను నయం చేయవచ్చు. అదీ, చిన్న కత్తిగాటు కూడా లేకుండానే శస్త్రచికిత్స పూర్తి చేయడం..
ఆధునిక వైద్య విధానం అందించిన గొప్ప వరం. మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ తదితర సున్నిత భాగాలలో పుట్టుకొచ్చే చిన్నపాటి కణితులకు సర్జరీ చేయడమంటే కొంత కష్టమైన పనే. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎలాంటి కోతలూ లేకుండా కేవలం కణితిని మాత్రమే లక్ష్యం చేసుకుని.. చుట్టూ ఉన్న కణాలకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా ‘మిస్సైల్ టెక్నాలజీ’తో మటుమాయం చేయగలిగే రేడియేషన్ పద్ధతినే ‘రోబోటిక్ రేడియో సర్జరీ’ అంటారు. నిపుణుడి మార్గదర్శనంలో.. క్యాన్సర్ కణాలే లక్ష్యంగా, శరీరంలో ఏ భాగాన్నయినా చేరగలిగే, కచ్చితమైన చికిత్స అందించే రేడియేషన్ పద్ధతినే ‘సైబర్ నైఫ్’ అని కూడా అంటారు. సైబర్‌నైఫ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు. ఇక్కడ కోతలు ఉండవు. ఎంత చిన్న క్యాన్సర్ కణితినైనా సులభంగా తొలగించవచ్చు. ఆరోగ్యకర భాగాలపై ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించవు.
రేడియేషన్‌కు పరిష్కారం
1896 నుంచి క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ పొలోనియం, రేడియం వంటి రేడియో యాక్టివ్ మూలకాలను కనుగొన్నాక, ఈ చికిత్స మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శతాబ్ద కాలంలో చికిత్సా విధానంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. కాకపోతే, తగిన మోతాదులో రేడియేషన్ ఇవ్వకపోవడం వల్ల క్యాన్సర్ కణం లొంగకపోవడం, రేడియేషన్ మోతాదుకు మించినప్పుడు ఇతర అవయవాలకు ఆ ప్రభావం విస్తరించడం.. ఫలితంగా క్యాన్సర్ మరణాలు సంభవించడం.. దీనికున్న పరిమితి.
ఇక్కడ రేడియేషన్ పరిమాణాన్ని ‘గ్రే’లతో పోలుస్తారు. 10 గ్రేలతో జుట్టు రాలిపోతే, 45 ‘గ్రే’లను మించితే శాశ్వతంగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. రేడియేషన్ క్యాన్సర్ కణితికే కాకుండా ఇతర అవయవాలకు, కణాలకు సోకినప్పుడు అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. వీటిలో కొన్ని తాత్కాలికం. మరికొన్ని శాశ్వతం. రొమ్ము క్యాన్సర్‌కు రేడియేషన్ ఇచ్చినప్పుడు గుండె మీద ప్రభావం పడుతుంది. బ్రెయిన్ ట్యూమర్‌కు ఇచ్చే రేడియేషన్ వల్ల చురుకుదనం తగ్గుతుంది. ఎదుటి వ్యక్తిని గుర్తించే శక్తిని కోల్పోవచ్చు కూడా.
ఆ చెడు ప్రభావాలలో ప్రాథమికమైనవి..
సైబర్ నైఫ్ టెక్నాలజీతో ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఐదారు వారాలలో ఇచ్చే రేడియో థెరపీని, సైబర్ నైఫ్ సాయంతో ఒకటి నుంచి ఐదు రోజులలోనే పూర్తి చేయవచ్చు. క్యాన్సర్ కణాల మీద మాత్రమే రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఆ దాడి కూడా వేగవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి, రోగికి విశ్రాంతి అవసరం లేదు. రక్త స్రావం జరుగదు కాబట్టి, రక్తం ఎక్కించాల్సిన అవసరం రాకపోవచ్చు. శరీరంలో ఎంత చిన్న కణితి, ఎక్కడ ఉన్నా కచ్చితమైన రేడియేషన్‌ను అందిస్తుంది. రేడియేషన్ దుష్ఫలితాలను గణనీయంగా లేదా పూర్తిగా తగ్గిస్తుంది.
రోగి వయసు, క్యాన్సర్ దశ, కణితి గ్రేడింగ్, క్యాన్సర్ కణితి ఉన్న అవయవం మొదలైన అంశాల ఆధారంగా చికిత్స కోసం రోబోటిక్ రేడియో సర్జరీనీ ఎన్నుకుంటారు. రోబోటిక్ టెక్నాలజీని జోడించడంవల్ల.. రోబో సాయంతో మూలమూలనున్న క్యాన్సర్ కణాలను కూడా గుర్తించి, నిరోధించడం సాధ్యం అవుతుంది. దాదాపు తుది దశలోని రుగ్మతను సైతం ఇది నిరోధిస్తుందని అనేక గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు క్యాన్సర్ తిరగబెట్టిన అవయవానికి ఇతర రేడియేషన్ పద్ధతులతోపాటు సైబర్ నైఫ్ చికిత్స కూడా అవసరం కావచ్చు. ఈ సాంకేతికతతో క్యాన్సరేతర.. మెనింజియోమాస్, పిట్యూటరీ గ్రంథిలోని కణితులు, మెదడు లోపల, బయట ఉండే కణితులు, వెన్నెముక మీద వచ్చే కణుతులను తొలగించడం మరింత సులభం. సైబర్ నైఫ్‌లో పెన్సిల్ రేడియేషన్ కిరణాలను ఉపయోగిస్తారు.సైబర్ నైఫ్ టెక్నాలజీని ఎంచుకోడానికి ముందు.. రోగికి సీటీ స్కాన్ చేస్తారు. దీనివల్ల కణితులు ఏ ఆకారంలో, ఏ ప్రాంతంలో ఉన్నదీ అర్థమైపోతుంది. ఆ తర్వాత అసలు చికిత్స ఆరంభిస్తారు.
80-90 శాతం విజయాలు
సాధారణ చికిత్సతో పోల్చితే సైబర్‌నైఫ్ పద్ధతిలో సక్సెస్ రేటు 80 నుంచి 90 శాతం ఉంటుంది. క్యాన్సర్ కణితి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇతర చికిత్సా పద్ధతులలో ఆశించిన ఫలితాలు ఉండవు. సైబర్నైఫ్లో ఆ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలైన మెదడు, వెన్నుపూస, ఊపిరితిత్తులు వంటి అవయవాలపై ఏర్పడిన క్యాన్సర్ కణితులకు చికిత్స అందించడంలో సైబర్నైఫ్కు తిరుగులేదు.
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ జయలత
డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్