Kiwi Fruit With Skin | కివి పండ్లను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా చాలా మంది జ్వరం వచ్చినప్పుడు ఈ పండ్లను తింటుంటారు. కివి పండ్లను తింటే జ్వరం నుంచి త్వరగా కోలుకోవడమే కాకుండా, డెంగీ వంటివి వచ్చిన సందర్భాల్లో ప్లేట్లెట్లు త్వరగా పెరుగుతాయి. దీంతో ప్రాణాపాయం తప్పుతుంది. ఇలా కివి పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే కివి పండ్లను చాలా మంది తొక్క తీసేసి తింటారు. కానీ ఈ పండ్లను తొక్కతో సహా తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కివి పండ్ల పొట్టు చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఈ పండ్లను తొక్కతో సహా తింటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. కివి పండ్లను పొట్టుతో సహా తినాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
కివి పండ్ల తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తొక్కతో సహా తింటే ఆయా పోషకాలను పొందవచ్చు. కివి పండ్ల తొక్కలో ఉండే ఫైబర్ కారణంగా మనం తినే ఆహారాల్లో ఉండే ఫోలేట్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. విటమిన్ ఇ ని కూడా శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. కివి పండ్ల తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
అయితే కివి పండ్ల తొక్కపై ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణం వల్ల ఈ తొక్కను తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఏదైనా టవల్ లేదా కూరగాయల బ్రష్‌తో ఆ వెంట్రుకల లాంటి నిర్మాణాన్ని తొలగించాలి. తరువాత శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ తొక్కను తినవచ్చు. ఇలా కివి పండ్లను తొక్కతో సహా తింటే అనేక లాభాలను పొందవచ్చు. కివి పండ్లలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుతుంది. కివి పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా ఈ పండ్లను తింటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఈ పండ్లలో యాక్టినైడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసేందుకు సహాయ పడుతుంది. కనుక మాంసాహారం తిన్నప్పుడు కివి పండ్లను తింటే త్వరగా జీర్ణమవుతుంది.
కివి పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఈ పండ్లను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండెపై పడే భారం తగ్గుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ ఒక కివి పండును తినేవారికి రక్తం పలుచగా మారి గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. కివి పండ్లలో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. కళ్ల సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. కివి పండ్లను సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు వరకు తినవచ్చు. వీటిని పొట్టుతో సహా తింటేనే అధిక మొత్తంలో ప్రయోజనాలు కలుగుతాయి.