Diabetics | కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక రకాల వంటలను కూడా చేస్తుంటారు. కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్లను తినే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. కోడిగుడ్లను అసలు ఎవరు తినకూడదు..? షుగర్ ఉన్నవారు గుడ్లను తినవచ్చా..? కోడిగుడ్లను ఎంత మోతాదులో తినాలి..? వీటిని అధికంగా తింటే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి..? అన్న విషయాలపై చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఇక వీటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్లను తినాలా.. వద్దా.. అని సందేహిస్తుంటారు. అయితే డయాబెటిస్ ఉన్నప్పటికీ కోడిగుడ్లను తినవచ్చు. మానేయాల్సిన పనిలేదు. కానీ మోతాదులోనే తినాలి. కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన తీసేని తినాల్సి ఉంటుంది. లేదంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్లను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) చెబుతున్న ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 గుడ్లను తినవచ్చు. లేదా వారంలో 7 నుంచి 12 గుడ్ల వరకు తినవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం రోజూ ఒక గుడ్డును తిన్నా అందులోని పచ్చ సొనను తీసి తినాల్సి ఉంటుంది.
కోడగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ కూడా సమృద్ధిగాలభిస్తాయి. కనుక కోడిగుడ్లను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లను అసలు తినకూడదు. ఎందుకంటే రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది మళ్లీ హార్ట్ ఎటాక్ కు దారి తీయవచ్చు. కనుక గుండె సమస్యలు ఉన్నవారు గుడ్లను తినకూడదు, లేదా డాక్టర్ సూచన మేరకు తినాల్సి ఉంటుంది.
అలర్జీలు ఉన్నవారికి కొన్ని రకాల ఆహారాలు పడవు. సోయా అలర్జీలు ఉన్నవారికి కోడిగుడ్లు పడవు. కనుక అలాంటి వారు కూడా కోడిగుడ్లను తినకడూదు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే గుండెపై భారం పడి స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక మీడియం సైజ్ కోడిగుడ్డును తినడం వల్ల మనకు 72 క్యాలరీల శక్తి లభిస్తుంది. 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయి. అలాగే విటమిన్ బి12, డి, బి2, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు గుడ్లలో అధికంగా ఉంటాయి. ఆరోగ్యవంతులు అయినా సరే కోడిగుడ్లను మోతాదులోనే తినాలి. అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీర్ణశక్తి మందగిస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారిన పడి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక కోడిగుడ్లను తినే వారు ఈ జాగ్రత్తలను పాటిస్తూ వాటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.