పిల్లల పెంపకం
మా పాప వయసు మూడు నెలలు. మూడు వారాల కిందట సరిగా పాలు తాగడం లేదని, నీరసంగా ఉందని వైద్యుణ్ని సంప్రదించాం. పాప గుండె కొట్టుకునే రేటు ఎక్కువగా (200కు పైగా) ఉందని, వెంటనే పెద్ద దవాఖానకు తీసుకెళ్లమన్నారు. అక్కడ ఈసీజీ పరీక్ష చేశారు. పాపకు ఎస్వీటీ (సుప్రా వెంట్రిక్యులర్ టాకికార్డియా- supra ventricular Tachycardia) సమస్య ఉందని మందులు ఇచ్చారు. తర్వాత పాప నార్మల్ అయింది. మరుసటి రోజు డిశ్చార్జి చేశారు. కానీ, మళ్లీ గత వారం అదే సమస్య వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది. దీనికి పూర్తి చికిత్స లేదా? సలహా ఇవ్వగలరు.
– ఓ పాఠకురాలు
ఎస్వీటీ అనేది గుండెలో ఎలక్ట్రికల్ పాత్వేలో వచ్చే ఇబ్బంది వల్ల ఏర్పడుతుంది. శిశువుల్లో గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 100-130 వరకు ఉంటుంది. పెద్దవారి విషయంలో ఇది నిమిషానికి 60-70 ఉంటుంది. పిల్లల్లో నిమిషానికి 200-300 సార్లు గుండె కొట్టుకుంటే ఎస్వీటీగా భావించాలి. దీనివల్ల గుండె నుంచి శరీర అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవచ్చు. అయితే, ఎస్వీటీ కండిషన్ కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వరకు, ఒక్కోసారి కొన్ని గంటల వరకూ ఉండొచ్చు.
అలా ఎక్కువ సమయం ఉన్నప్పుడు బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగక బిడ్డకు ఇబ్బంది తలెత్తవచ్చు. సాధారణంగా ఇది అనుకోకుండా మొదలవుతుంది. ఈ సమయంలో బిడ్డ ఆయాసపడుతుంది. నీరసిస్తుంది. పాలు సరిగా తాగకపోవచ్చు. గుండె మీద చేయి పెట్టి గమనిస్తే.. గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సత్వర చికిత్సగా… ఎడినోసిన్ మెడిసిన్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. వెంటనే తగ్గిపోతుంది.
మళ్లీ మళ్లీ రాకుండా ట్యాబ్లెట్లు (బీటా బ్లాకర్) ఇస్తారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అబ్లేషన్ (ablation) ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కడైతే కణజాలంలో పదేపదే గుండె కొట్టుకునేలా ఇచ్చే సిగ్నల్‌ను బ్రేక్ చేసి.. సమస్యను పరిష్కరిస్తారు. ఇది మరీ ప్రమాదకరమైన గుండె జబ్బు కాదు. దీనికి పూర్తిస్థాయి చికిత్స ఉంది. కొంతమంది విషయంలో ఎలాంటి చికిత్స లేకుండానే తగ్గొచ్చు.
కొందరికి ట్యాబ్లెట్ల ద్వారానే సమస్య పరిష్కారం కావొచ్చు. ఇంకొందరికి అబ్లేషన్ ట్రీట్మెంట్ అవసరం పడొచ్చు. పాప విషయంలో మెరుగైన చికిత్స కోసం పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించండి. వారిచ్చే సూచన మేరకు చికిత్స చేయించండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్