Burning Sensation In Urine | మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను మన శరీరం మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇందుకు గాను కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. మనం శరీరంలోని వ్యర్థాలను వడబోసి కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. అనంతరం ఆ మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండి తరువాత బయటకు వస్తుంది. అయితే మూత్ర విసర్జన ప్రక్రియలో కొందరికి మూత్రం మంటగా వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. పులుపు, కారం, మసాలాలు ఉండే ఆహారాలను అతిగా తినే వారికి సహజంగానే మూత్రం మండినట్లు వస్తుంది. అలాగే మూత్రంలో ఆమ్లత్వం పెరిగినా, నీళ్లను సరిగ్గా తాగకపోయినా, మద్యం అతిగా సేవించినా, వేడి వాతావరణంలో ఎక్కువ సేపు ఉన్నా మూత్రంలో మంటగా అనిపిస్తుంది. అయితే నీళ్లను ఎక్కువగా తాగితే ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ అలా తగ్గకపోతే పలు ఇంటి చిట్కాలను పాటించాలి. అలాగే పలు ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మూత్రంలో మంట ఉన్నవారు బార్లీ జావను తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీళ్లను వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినీళ్లు కూడా ఈ సమస్యను తగ్గించగలవు. పూటకు 200 ఎంఎల మోతాదులో కొబ్బరినీళ్లను తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. పలుచని మజ్జిగను పూటకు ఒక గ్లాస్ చొప్పున తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఉసిరికాయల రసాన్ని పూటకు 30 ఎంఎల్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగుతున్నా కూడా సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటిస్తుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
మూత్రంలో మంట తగ్గేందుకు పలు ఆహారాలు కూడా మేలు చేస్తాయి. పాలకూరను జ్యూస్ గా చేసుకుని రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో తాగాలి. అలాగే పూటకు ఒక కీరదోసను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. పూటకు ఒక అరటి పండు కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. అలాగే పుచ్చకాయలు, తర్బూజాలను తింటున్నా కూడా ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఆయా ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే కేవలం మూత్రంలో మంట మాత్రమే ఉండి, ఇతర ఏ అనారోగ్య సమస్యలు లేకపోతే పైన తెలిపిన చిట్కాలు, తీసుకోవాల్సిన ఆహారాలు పనిచేస్తాయి. కానీ ఇతర అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సమస్య నుంచి బయట పడేందుకు అవకాశాలు ఉంటాయి.
మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రంలో మంటతోపాటు చీము వస్తుంటే ఇన్ఫెక్షన్ వచ్చిందని గుర్తించాలి. అలాంటప్పుడు డాక్టర్చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూత్రంలో మంటతోపాటు వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ స్టోన్లు ఉన్నాయని లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా డాక్టర్చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూత్రంలో దుర్వాసన వస్తున్నా, పదే పదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తున్నా, మూత్రం బొట్లు బొట్లుగా లీక్ అవుతున్నా, మూత్రం సరిగ్గా రాకపోయినా కూడా డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు కూడా మూత్రంలో మంట వచ్చేందుకు కారణం అవుతాయి. శీతల పానీయాలు, మద్యం, టీ, కాఫీ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. లేదా కొంతకాలంపాటు మానేయాలి. ఈ విధంగా జాగ్రత్తలను పాటిస్తూ సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మూత్రంలో మంట సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.