బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌తో బ్లడ్ క్యాన్సర్‌కు చెక్
రక్త క్యాన్సర్ నిర్ధారణ అయినంత మాత్రాన జీవితంపై ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్సలు ఎంతోమంది రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. సరైన వైద్య సలహా, సమయానికి చికిత్స, కుటుంబ సభ్యుల సహకారం, క్రమబద్ధమైన పర్యవేక్షణతో ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చు.
రక్త క్యాన్సర్ నిర్ధారణ అయినంత మాత్రాన జీవితంపై ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్సలు ఎంతోమంది రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. సరైన వైద్య సలహా, సమయానికి చికిత్స, కుటుంబ సభ్యుల సహకారం, క్రమబద్ధమైన పర్యవేక్షణతో ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చు.
రక్త క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. వైద్యరంగంలో వస్తున్న మార్పులతో బ్లడ్ క్యాన్సర్‌కు సరైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూలకణ మార్పిడి).. బ్లడ్ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నది. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ బాధితులకు సాధారణ జీవితాన్ని అందిస్తున్నది. రక్త క్యాన్సర్లతోపాటు అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యుపరమైన, రోగ నిరోధక, మెటబాలిక్ వ్యాధులు తీవ్రంగా ఉన్నవారికి కూడా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ఉపయోగపడుతున్నది.

Bone Marrow
బోన్‌మ్యారో అంటే?
ఎముక లోపల ఉండే మెత్తని పదార్థాన్ని బోన్‌మ్యారో (ఎముక మజ్జ) అంటారు. తుంటి ఎముకలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. బోన్‌మ్యారోలో రక్తాన్ని తయారుచేసే ‘హెమటోపోయటిక్ స్టెమ్ సెల్స్’ అనే మూలకణాలు ఉంటాయి. ఈ మూల కణాల నుంచే ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ తయారవుతాయి.
రక్తంలోని ఎర్ర రక్తకణాలు (ఆర్బీసీ) ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల నుంచి అన్ని శరీర భాగాలకూ చేరవేస్తాయి. బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధికారక క్రిములు శరీరంలోకి చొరబడితే.. వాటిని తెల్ల రక్తకణాలు (డబ్ల్యూబీసీ) నిర్మూలిస్తాయి. ఇక ప్లేట్లెట్స్.. గాయాల వద్ద రక్తం గడ్డకట్టేలా చేసి రక్త స్రావాన్ని నివారిస్తాయి. రక్తకణాల ఉత్పత్తి లోపించినా, అధికంగా ఉత్పత్తి అయినా అవి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
ఏమిటీ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్?
రక్తాన్ని తయారుచేసే వ్యవస్థను తిరిగి పని చేయించే ఉద్దేశంతో ఆరోగ్యకరమైన మూలకణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టే వైద్య విధానమే ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్’. ఇది పెద్ద శస్త్రచికిత్స కాదు.
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలో రోగి పరిస్థితిని బట్టి ముందుగా కీమోథెరపీ, రేడియేషన్‌తో కండిషనింగ్ చేస్తారు. ఈ చికిత్సల వల్ల వ్యాధిగ్రస్త కణాలు తగ్గుతాయి. కొత్త మూలకణాలు స్థిరపడేందుకు శరీరం అనుకూలంగా మారుతుంది. అనంతరం ఆరోగ్యవంతమైన మూలకణాలను కాథెటర్ పరికరంతో రక్తనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ మూలకణాలు రక్త ప్రవాహం ద్వారా బోన్‌మ్యారోకు చేరుకుని అక్కడ స్థిరపడతాయి. ఆ తర్వాత కొత్త ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ని ఉత్పత్తి చేస్తాయి.

Bonemarrowbiopsy
ఎవరికి అవసరం?
బోన్‌మ్యారో మార్పిడి ప్రతి రోగికీ అవసరమైన చికిత్స కాదు. అలాగే ఇది అన్నిరకాల రక్త క్యాన్సర్లకు శాశ్వత పరిష్కారం అనికూడా చెప్పలేం. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం, అనుభవజ్ఞులైన నిపుణులను సంప్రదించడం, తగిన రోగులకు ఆధునిక మూలకణ మార్పిడి చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
వ్యాధి రకం, దశ, జన్యుపరమైన లక్షణాలు, అంతకుముందు అందించిన చికిత్స, రోగి వయస్సు, శారీరక ఆరోగ్యం ఆధారంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను వైద్యులు నిర్ణయిస్తారు.
లుకేమియా: రక్తాన్ని తయారుచేసే మూలకణాల్లో ప్రారంభమయ్యే క్యాన్సర్‌ను లుకేమియా అంటారు. కొన్ని రకాల తీవ్రమైన లుకేమియాల్లో కీమోథెరపీ అనంతరం వ్యాధి మళ్లీ రాకుండా నియంత్రించేందుకు బోన్‌మ్యారో మార్పిడి చేస్తారు.
లింఫోమా: శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగమైన లింఫోసైట్లలో క్యాన్సర్ ఇది. సాధారణ చికిత్సకు లింఫోమా పూర్తిగా స్పందించనప్పుడు లేదా తిరిగి వచ్చినా మూలకణ మార్పిడి ఉపయోగపడుతుంది.
మల్టిపుల్ మైలోమా: బోన్మ్యారోలోని ప్లాస్మా కణాలకు వచ్చే క్యాన్సర్ ఇది. ఎంపిక చేసిన రోగుల్లో అధిక మోతాదు కీమోథెరపీ అనంతరం సొంత మూలకణాలతో చేసే ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సతో మెరుగైన ఫలితం పొందవచ్చు.
అప్లాస్టిక్ అనీమియా: బోన్‌మ్యారో రక్తకణాలను తక్కువగా ఉత్పత్తి చేయడాన్ని అప్లాస్టిక్ అనీమియా అంటారు. తీవ్రమైన సందర్భాల్లో, తగిన దాత లభించినప్పుడు అల్లోజెనిక్ మూలకణ మార్పిడితో రక్తకణాల ఉత్పత్తిని పునరుద్ధరించవచ్చు.

Bone Marrow Red Cells
మూలకణాలను ఎలా సేకరిస్తారు?
బోన్‌మ్యారోలో ఉండే మూల కణాలు రక్తంలోకి ఎక్కువగా విడుదలయ్యేలా దాతకు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తారు. ఆ రక్తాన్ని సేకరించి, అందులోని మూలకణాలను వేరు చేస్తారు. మిగిలిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపిస్తారు. ప్రస్తుతం ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. రక్త ప్రవాహం నుంచి సేకరించడం సాధ్యం కాకపోతే తుంటి ఎముక నుంచి ప్రత్యేక సూదుల సహాయంతో బోన్‌మ్యారోను సేకరిస్తారు.
చికిత్సకు ముందు
రక్త క్యాన్సర్ చికిత్సలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కీలకమైన చికిత్స. దీనిని ప్రారంభించే ముందు రోగికి రక్త పరీక్షలు, బోన్‌మ్యారో బయాప్సీ, జన్యు పరీక్షలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. దాత, రోగి మధ్య జన్యుపోలిక నిర్ధారించేందుకు హెచ్ఎల్ఏ చేస్తారు. వీటి ఆధారంగా రోగి శారీరకంగా ఈ చికిత్సను తట్టుకోగలడా? వ్యాధి ఏ స్థాయిలో ఉంది? ఏ రకమైన మూలకణ మార్పిడి అనుకూలంగా ఉంటుంది? అనే అంశాలను నిపుణుల బృందం అంచనా వేస్తుంది.
మూలకణ మార్పిడి ఎలా చేస్తారు?
చికిత్సకు రోగి సిద్ధమైన తర్వాత కీమోథెరపీ, అవసరాన్ని బట్టి రేడియేషన్‌తో కూడిన కండిషనింగ్ చికిత్సను అందిస్తారు. అనంతరం ఛాతీ లేదా చేతిలోని పెద్ద రక్తనాళంలో ప్రత్యేక కాథెటర్‌ను అమర్చి, దాని ద్వారా ఆరోగ్యకరమైన మూలకణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ రక్తం ఎక్కించినట్లుగానే ఉంటుంది. మత్తుమందు అవసరం ఉండదు. మూలకణాలు రక్తప్రవాహం ద్వారా బోన్‌మ్యారోకు చేరుకుని స్థిరపడతాయి. వీటి నుంచి కొత్త రక్తకణాల ఉత్పత్తి ప్రారంభం కావడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ఈ సమయంలో రోగికి ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేక గదిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులు, రక్తం, ప్లేట్లెట్లను కూడా అందిస్తారు.

Bmtransplant
చికిత్సలో సమస్యలు
కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వికారం, వాంతులు, నోటిలో పుండ్లు, విరేచనాలు, జుట్టు రాలడం, అలసట రావచ్చు. తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ బాధితుల్లో గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ సమస్య రావొచ్చు. ఈ స్థితిలో దాత నుంచి వచ్చిన రోగనిరోధక కణాలు రోగి శరీరంలోని చర్మం, కాలేయం, పేగులు వంటి అవయవాలపై దాడి చేస్తాయి. చర్మంపై దద్దుర్లు, దురద, విరేచనాలు, కడుపునొప్పి, కామెర్లు రావొచ్చు. కొందరిలో మూలకణాలు బోన్‌మ్యారోలో సరిగా స్థిరపడకపోతే కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. ముందస్తు పరీక్షలు, సరైన చికిత్స, నిరంతర పర్యవేక్షణతో ఈ సమస్యలను కూడా నియంత్రించే అవకాశాలున్నాయి.
కోలుకోవడానికి ఎంతకాలం?
కొత్త మూలకణాలు బోన్‌మ్యారోలో స్థిరపడి రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. కొత్త రక్తకణాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత రోగనిరోధక వ్యవస్థ పూర్వ స్థితికి రావడానికి కొన్ని నెలల నుంచి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.
చికిత్స తర్వాత జాగ్రత్తలు
- బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత క్యాన్సర్ రోగులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి.
- వైద్యులు సూచించిన ఆహార నియమాలు పాటించాలి.
- పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి.
- జనం గుంపుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు.
- ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- వైద్యుల సూచనల ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడాలి.
- వైద్యుల సలహాతో టీకాలు వేయించుకోవాలి.
- జ్వరం, చలి, శ్వాస సమస్య, విరేచనాలు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ కె. కరుణ కుమార్
సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ & బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

