Black Pepper On Bananas | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఇవి ధర కూడా తక్కువగానే ఉంటాయి. అందుకని పేద నుంచి ధనిక వర్గాల వారి వరకు అందరూ ఈ పండ్లను ఎక్కువగా కొని తింటుంటారు. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన వారు, శారీరక శ్రమ చేసిన వారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. మళ్లీ చురుగ్గా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. అరటి పండ్లను తింటే ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడి మైండ్ రిలాక్స్ అవుతుంది. అయితే ఉదయం పరగడుపునే అరటి పండ్లపై మిరియాల పొడి చల్లి తింటే అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ అనేక రోగాలకు పనిచేస్తుందని వారు అంటున్నారు.
అరటి పండ్లలో సహజసిద్ధమైన ఫైబర్ ఉంటుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. నల్ల మిరియాల వల్ల జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తింటే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. ఉదయమే ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అరటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తింటే ఇమ్యూనిటీ పవర్ మరింత పెరుగుతుంది. దీంతో శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతాయి. రోగాల నుంచి బయట పడవచ్చు. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
నల్ల మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. కొవ్వును కరిగించేందుకు సహాయం చేస్తుంది. అందువల్ల మిరియాలను అరటి పండ్లతో కలిపి తింటే ఈ రెండింటి కాంబినేషన్ శరీరానికి శక్తిని అందించడమే కాదు, బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. అరటి పండ్లలో ఉండే ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. నల్ల మిరియాల్లో శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తింటే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
అరటి పండ్లు లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటిని కలిపి తింటే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. అరటి పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇక మిరియాలను తింటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఈ రెండింటి కాంబినేషన్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా మిరియాల పొడి, అరటి పండ్ల మిశ్రమం మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.