యోగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేసి, అధిక బరువు తగ్గేలా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా చేయడం చాలా ముఖ్యం. ఇది హృదయ, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక రుగ్మతల లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, వివిధ రకాల యోగా భంగిమలు వివిధ శరీర భాగాల కండరాలను లక్ష్యంగా చేసుకుంటాయి. సాధారణంగా, యోగా మానసిక విశ్రాంతిని, మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని మిళితం చేసేందుకు తరచూ యోగా చేయాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. కాగా, యోగాలో సింహాసనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మలైకా అరోరా పర్సనల్ కోచ్ సర్వేశ్ శశి పేర్కొన్నారు.
సర్వేశ్ శశి తన ఇన్స్టాగ్రాంలో సింహాసనం ప్రయోజనాలను తెలిపే వీడియోను పోస్ట్ చేశారు. సింహాసనం ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం ఒత్తిడి, కోపాన్ని తగ్గించడంలో మీకు సహాయపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను పెంచుతుందని సర్వేశ్ తెలిపారు. సర్వేశ్ ప్రకారం.. ఛాతీ, ముఖం నుంచి ఒత్తిడిని తొలగించడంలో సింహాసనం సహాయపడుతుంది. నరాలను సక్రియం చేస్తుంది. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఉబ్బసం, గొంతునొప్పి, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.