Barefoot Walking | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలన్న విషయం తెలిసిందే. వ్యాయామం వల్ల శరీరానికి శారీరక శ్రమ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ క్రమంలోనే వ్యాయామం విషయానికి వస్తే చాలా మంది చేసేది వాకింగ్ అని చెప్పవచ్చు. అయితే వాకింగ్‌లోనూ పలు రకాలు ఉంటాయి. వాటిల్లో బేర్ ఫుట్ వాకింగ్ కూడా ఒకటి. అంటే కాళ్లకు ఏమీ ధరించకుండా చేసే వాకింగ్ అన్నమాట. దీని వల్ల మన పాదాలు నేరుగా భూమికి తాకుతాయి. దీంతో భూమిలో ఉండే సహజసిద్ధమైన విద్యుత్ శక్తి మనలో ప్రసారం అవుతుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చెప్పులు లేదా షూస్ లేకుండా వాకింగ్ చేస్తే అనేక లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే పాదాలు, కాళ్ల కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఆయా భాగాలు మరింత శ్రమిస్తాయి. ఫలితంగా ఆయా భాగాలకు మరింత వ్యాయామం అవుతుంది. ఆయా భాగాల్లో మొత్తం 29 రకాల కండరాలు ఉంటాయి. అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎముకలు, కీళ్లు, లిగమెంట్స్ దృఢంగా మారుతాయి. దీంతో పాదాలు, మడమలకు బలం లభిస్తుంది. గాయాల బారిన పడకుండా ఉంటారు. బేర్ ఫుట్ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్లు, తుంటి, వెన్నెముకకు సైతం వ్యాయామం అవుతుంది. ఆయా భాగాల్లో ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. దీంతో శరీరం సరిగ్గా బ్యాలెన్స్ కూడా అవుతుంది. మాటి మాటికీ తూలిపడిపోయే పరిస్థితి ఉన్నవారు ఇలా బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే ఫలితం ఉంటుంది.
బేర్ ఫుట్ వాకింగ్నే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని కూడా అంటారు. దీని వల్ల భూమికి మన పాదాలు నేరుగా తాకుతాయి. గడ్డి, మట్టి లేదా ఇసుకలో వాకింగ్ చేయవచ్చు. దీని వల్ల నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ప్రభావం తగ్గుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఇలా వాకింగ్ చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల మెదడులో ఉండే నాడులు ఉత్తేజం చెందుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది.
బేర్ ఫుట్ వాకింగ్ వల్ల శరీరంలో ఉండే వాపులు తగ్గిపోతాయి. భూమి నుంచి పాదాల ద్వారా ఎలక్ట్రాన్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. బేర్ ఫుట్ వాకింగ్ చేయడం వల్ల శరీరం సహజసిద్ధంగా నడిచే భంగిమకు అలవాటు పడుతుంది. దీంతో పాదాలకు ఇన్ ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. పాదాల కదలికలు సైతం సరిగ్గా ఉంటాయి. పాదాల వాపుల నుంచి బయట పడవచ్చు. అయితే బేర్ ఫుట్ వాకింగ్ మంచిదే అయినప్పటికీ ఇలా వాకింగ్ చేసేవారు జాగ్రత్తలను పాటించాలి. నడిచే దారిలో పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాయాలు అవుతాయి. కొన్ని ప్రదేశాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో బేర్ ఫుట్ వాకింగ్ చేయకూడదు. బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే కొందరు అసౌకర్యానికి గురవుతారు. అలాంటి వారు కూడా దీన్ని పాటించకూడదు.