Bananas | అరటి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అరటి పండ్లను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు ఏడాది పొడవునా లభిస్తాయి. చాలా మంది అరటి పండ్లను పలు రకాలుగా తింటుంటారు. అయితే ఇతర ఆహారాల్లాగే అరటి పండ్లను తినడంలోనూ చాలా మందికి ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. అరటి పండ్లను తినడం వల్ల దగ్గు, జలుబు వస్తాయని చాలా మంది అనుకుంటారు. ఈ విషయాన్ని కొందరు మనకు పదే పదే చెబుతుంటారు కూడా. అయితే ఇది నిజమేనా..? అరటి పండ్లను తింటే నిజంగానే దగ్గు, జలుబు వస్తాయా.. దీనిపై వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారు..? అంటే..
వైద్యులు చెబుతున్న ప్రకారం అరటి పండ్లను తినడం వల్ల దగ్గు, జలుబు ఏర్పడవు. వాతావరణంలో ఉండే వైరస్ల కారణంగా ఈ రెండు వ్యాధులు వస్తాయి. కనుక అరటి పండ్లను భేషుగ్గా తినవచ్చని, ఈ పండ్లతో దగ్గు, జలుబు రావని వైద్యులు చెబుతున్నారు. ఇక అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.
అయితే అరటి పండ్లను తినడం వల్ల కఫం మాత్రం పెరుగుతుంది. అది కూడా జలుబు, దగ్గు ఉన్నప్పుడు మాత్రమే. అందువల్ల ఇప్పటికే ఆయా సమస్యలతో బాధపడుతున్నవారు అరటిపండ్లను తినకూడదు. తింటే కఫం ఎక్కువగా తయారై సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక అరటి పండ్లను దగ్గు, జలుబు ఉన్నప్పుడు తినకూడదు. సాధారణ సమయంలో తినాలి. ఇక ఆస్తమా, అలర్జీల వంటివి ఉన్నవారు అరటి పండ్లను తినగానే కాస్త రియాక్షన్ అయినట్లు అనిపిస్తుంది. అది సహజమే. అంత మాత్రం చేత అరటి పండ్లను తినకుండా ఉండడం సరికాదు.
అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం ఉంటాయి. ఈ పండ్లను మనం భిన్న రకాలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా స్మూతీలు, ఓట్ మీల్, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. అయితే కఫం ఎక్కువగా తయారయ్యే వారు, దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను వీటితో కలిపి కాదు కదా, నేరుగా కూడా తినకూడదు.
ఇక మీకు వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో మన వంట ఇంట్లో ఉండే పలు పదార్థాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి, పసుపు, తులసి ఆకులు, బాదంపప్పు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, చిలగడ దుంపలు వంటివి దగ్గు, జలుబును సమర్థవంతంగా తగ్గించగలవు. ఈ ఆహారాల్లో అనేక విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.