బ్యాలెన్సింగ్ అనేది పరిపూర్ణతకు కీలకం. అది ఆహారమైనా కావొచ్చు.. లేదా వ్యాయామం అయినా కావొచ్చు. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది దీర్ఘాయువుకు సూచికగా మారిపోయింది. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఎంతకాలం జీవించగలడో అనేది బ్యాలెన్స్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. ఒంటికాలిపై పది సెకన్లపాటు కూడా నిల్చుండకపోతే ముందస్తు మరణ ప్రమాదం 84 శాతం పెరుగుతుందని తేల్చారు.
షూస్, సాక్స్‌లు లేకుండా ఒక చేత్తో ఒక కాలిని పట్టుకొని ఇంకో చేతిని ముందుకు చాచి ఒంటికాలిపై పది సెకన్లు నిల్చుకోవాలి. ఈ అధ్యయనంలో ప్రతి ఐదుగురిలో ఒకరు విఫలమయ్యారు. 71 నుంచి 75 ఏళ్ల వయస్సు గలవారిలో 54 శాతం మంది సమతుల్యతను సాధించలేకపోయారు. 51-55 ఏళ్ల వయస్సు గల వారిలో ఐదు శాతం మంది ఫెయిల్ అయ్యారు.
ఈ అధ్యయన ఫలితాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. నిపుణులు కొంతమందిని రెండు వర్గాలుగా విభజించి ఏడేళ్లు గమనించారు. ఇందులో ఏడు మంది మరణించినట్లు వారు కనుగొన్నారు. మృతిచెందినవారిలో 17.5 శాతం మంది బ్యాలెన్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు తెలిపారు. దీని ఆధారంగా పది సెకన్లపాటు ఒంటికాలిపై నిల్చోలేకపోవడం వల్ల ముందస్తు మరణ ప్రమాదం 84 శాతం పెరుగుతుందని పరిశోధకులు నిర్ధారించారు.