Bad Breath Home Remedies | నోటి దుర్వాసన సమస్య అనేది మనకు సహజంగానే అప్పుడప్పుడు వస్తుంటుంది. నోట్లో బాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. అయితే నోటి దుర్వాసన ఉంటే నలుగురిలోనూ మాట్లాడాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. నోరు తెరిచేందుకే ఇబ్బందులు పడతాం. నోటి దుర్వాసన సమస్యనే హాలిటోసిస్ అని కూడా అంటారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్య అనేది వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం, తరచూ సరిగ్గా బ్రష్ చేయకపోవడం, దంతాల సందులను క్లీన్ చేసుకోకపోవడం, పలు రకాల మెడిసిన్లను వాడడం లేదా జీర్ణ సమస్యలు ఉన్నా నోరు దుర్వాసనగా ఉంటుంది.
పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవాలంటే కచ్చితంగా రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. దీంతో నోట్లో బాక్టీరియా పేరుకుపోదు. ఫలితంగా దుర్వాసన తగ్గుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్ లేదా విటమిన్ ఇ ఆయిల్, బాదంనూనె వంటి వాటితో మీ దంతాలు, చిగుళ్లను అప్పుడప్పుడు మసాజ్ చేస్తుండండి. నోటి దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే ఈనూనెలతో రోజూ మసాజ్ చేయండి. దీంతో నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.
చాలా మంది కేవలం దంతాలను మాత్రమే శుభ్రం చేసుకుంటారు. నాలుకను శుభ్రం చేయరు. కానీ నాలుకను కూడా శుభ్రం చేయాలి. లేదంటే బ్యాక్టీరియా పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. కనుక టంగ్ క్లీనర్ సహాయంలో నాలుకను శుభ్ర పరచాలి. అలాగే గ్లిసరిన్, కాటన్ ప్యాడ్ ఉపయోగించి కూడా నాలుకను శుభ్రం చేయవచ్చు. దీంతో నోటి దుర్వాసన తగ్గడమే కాదు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మార్కెట్లో మనకు అనేక రకాల మౌత్ వాష్‌లు లభిస్తున్నాయి. వీటిని తీసుకుని రోజూ రాత్రి పూట మౌత్ వాష్ చేయాలి. కనీసం 2 నుంచి 3 సార్లు మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. మౌత్ వాష్‌ను నోట్లో పోసిన తరువాత 30 సెకన్ల పాటు నోట్లో పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు.
నోటి దుర్వాసన నుంచి బయట పడేసేందుకు పుదీనా ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. లేదా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించినా చాలు, నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అలాగే నిమ్మరసాన్ని నీటిలో పోసి ఆ నీటిలో నోటిని శుభ్రం చేస్తుండాలి. దీంతోపాటు నోటిని శుభ్రం చేయడంలో యూకలిప్టస్ ఆయిల్ కూడా బాగానే పనిచేస్తుంది. అర గ్లాస్ నీటిలో 2 లేదా 3 చుక్కల యూకలిప్టస్ నూనెను వేసి బాగా కలిపి ఆ నీటితో నోటిని శుభ్రం చేయాలి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ తగినన్ని నీళ్లను తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. నీళ్లను సరిగ్గా తాగకపోయినా కూడా నోరు దుర్వాసన వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్లను రోజూ తగినన్ని తాగాల్సి ఉంటుంది. ఇక భోజనం చేసిన ప్రతిసారి కాసిన్ని సోంపు గింజలను నోట్లో వేసుకుని నములుతుంటే నోటి దుర్వాసన అన్నది ఉండదు. ఈ విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.