Atibala Plant Benefits | మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఔషధగుణాలు ఉండే మొక్కలు కూడా ఉన్నాయి. కానీ అనేక ఔషధ మొక్కల గురించి చాలా మందికి ఇంకా తెలియదు. అలాంటి ఔషధ మొక్కల్లో అతిబల కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. కానీ దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయని ఎవరికీ తెలియదు. అతిబల మొక్క పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. దీని కాయలు, పువ్వులు, ఆకులు, కాండం, వేళ్లు అన్నీ మనకు ఔషధ పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా తెచ్చి వాడండి. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
అతిబల మొక్క అనేక వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కుష్టు, మూత్రాశయ సమస్యలు, కామెర్లు, చిన్నారులకు వచ్చే వ్యాధులు, అతి దాహం, గాయాలు, అల్సర్లు, యోని ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, గౌట్, టీబీ, బ్రాంకైటిస్, అలర్జీలు, జీర్ణ సమస్యలు, నీరసం, నాడీ సమస్యలు, తలనొప్పి, కండరాల బలహీనత, గుండె జబ్బులు, రక్తస్రావం, పక్షవాతం వంటి అనేక వ్యాధులను తగ్గించడంలో అతిబల అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో రకాల వ్యాధులను సమర్థవంతంగా తగ్గిస్తుంది కాబట్టే దీనికి అతిబల అనే పేరు వచ్చింది. ఇక దీన్ని ఎలా వాడో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిబల మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించి డికాషన్ తయారు చేయాలి. దీన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేస్తుండాలి. దీంతో దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతాయి. నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ల వాపు నుంచి కూడా బయట పడవచ్చు. అతిబల వేళ్ల చూర్ణంలో కాస్త చక్కెర కలిపి తింటుంటే అతి దాహం తగ్గుతుంది. అతిబల ఆకుల డికాషన్, కంటకారి, బృహతి, వస ఆకులు, ద్రాక్ష పండ్లు కలిపి అందులో 5 గ్రాముల చక్కెర వేసి కలపాలి. దీన్ని రోజుకు 2 సార్లు 30 ఎంఎల్ చొప్పున తీసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల కఫంతో కూడిన దగ్గు తగ్గుతుంది.
చిన్నారులకు వచ్చే ఏ వ్యాధిని అయినా సరే అతిబల తగ్గిస్తుంది. ఇందుకు గాను అతిబల ఆకులను వేసి మరిగించి అందులో కాస్త బెల్లం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నారులకు ఇస్తుంటే వారికి వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విరేచనాలు, మూత్రంలో రక్తం పడుతున్నవారు అతిబల ఆకులు, నెయ్యి మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అలాగే అతిబల వేళ్లతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగుతుంటే మూత్రంలో రక్తం పడడం తగ్గుతుంది.
అతిబల, పృష్ణపర్ణి, కటేరి, లఖ్, శొంఠి వేసి పాలలో కలిపి తాగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. అతిబల మొక్కకు చెందిన ఆకులు లేదా వేళ్లతో కషాయం తయారు చేసి తాగుతుంటే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. దీన్ని రోజుకు 2 సార్లు 40 ఎంఎల్ మోతాదులో తాగాలి. అలాగే 4 నుంచి 8 గ్రాముల అతిబల విత్తనాలను తింటున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక నీరసంగా ఉంటే అతిబల విత్తనాలను ఉడికించి తింటుండాలి. దీంతో నీరసం తగ్గి శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఇలా అతిబల మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ చిట్కాలను డాక్టర్ల పర్యవేక్షణలో పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.