Anuloma Viloma Pranayamam | మీరు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను మీరు మీ దినచర్యలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. యోగాలో ఒక్కో ఆసనంతోపాటు ప్రాణాయామం కూడా భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ప్రాణాయామం విషయానికి వస్తే ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అనులోమం-విలోమం. ఇది అంత కష్టమైందేమీ కాదు. దీన్ని చేయాలంటే ముందుగా సుఖాసనం లేదా వజ్రాసనం వేసి కూర్చోవాలి. తరువాత వెన్నెముకను నిటారుగా ఉంచాలి. అనంతరం శ్వాసను వదలాలి.
ఇప్పుడు బొటన వేలిని కుడి ముక్కు రంధ్రంపై పెట్టి ఎడమ ముక్కు రంధ్రంతో గాలిని లోపలికి పీల్చాలి. తరువాత బొటనవేలిని తీసేసి దాన్ని ఎడమ ముక్కుపై పెట్టాలి. ఇప్పుడు శ్వాసను కుడి ముక్కు రంధ్రం నుంచి వదలాలి. మళ్లీ కుడి ముక్కు నుంచే శ్వాసను పీల్చాలి. తరువాత దాన్ని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇలా స్టెప్స్‌ను రిపీట్ చేయాలి. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనస్సును శ్వాసపైనే నిలపాలి. వేరే విషయాలను గురించి ఆలోచించకూడదు. అలాగే ఖాళీ కడుపుతో ఈ వ్యాయామం చేయాలి. మొదట్లో ఈ వ్యాయామాన్ని రోజుకు 5 నిమిషాల పాటు చేయాలి. తరువాత నెమ్మదిగా సమయాన్ని పెంచుతూ పోవాలి. ఆ తరువాత కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా ఈ వ్యాయామాన్ని రోజూ చేయాలి. అలాగే ప్రాణాయామం చేసే చోటు చాలా సౌకర్యవంతంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలో అయితే మేలు. ఎలాంటి శబ్దాలు కూడా ఉండకూడదు. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది.
అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వ్యాయామం మొత్తం శ్వాస మీదే ఉంటుంది కనుక శరీరంలో రక్త సరఫరా మెరుగు పడేందుకు సహాయం చేస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. నెగెటివ్ ఆలోచనలు ఉన్నవారు ఈ వ్యాయామం చేస్తుంటే ఫలితం ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడమే కాదు నిద్ర చక్కగా పడుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది. సైనస్ సమస్య ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం చేయవచ్చు. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.