పటికను ఆయుర్వేద వైద్యంలో తరతరాలుగా వాడుతున్నారు. నోటి ఆరోగ్యం మొదలుకుని శరీర దుర్వాసన దూరం చేయడం వరకు ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పటికలో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
పంటి చిగుళ్లపై బ్యాక్టీరియా పేరుకుపోవడంతో రక్తస్రావం సమస్య తలెత్తుతుంది. ఇది పంటి ఎనామెల్‌ను దెబ్బతీసి పాచికి దారితీస్తుంది. ఆలంలో యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. దీంతో చిగుళ్లు గట్టిపడతాయి. రక్తం కారడం ఆగిపోతుంది. పటిక నీళ్లను పుక్కిలిస్తే నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది.
నోటి దుర్వాసనను నిర్లక్ష్యం చేస్తే రాన్రాను అది ఇబ్బందిగా మారుతుంది. బ్యాక్టీరియా కారణంగా దంతాల్లో క్యావిటీలు, విపరీతమైన దుర్వాసన లాంటివి వస్తాయి. పటిక నీళ్లు పుక్కిలిస్తే నోట్లో బ్యాక్టీరియా పెరగదు. దీంతో నోటి దుర్వాసన దూరమైపోతుంది.
పటిక నీళ్లను రోజూ పుక్కిలిస్తే నోట్లో క్యాండిడా లాంటి ఫంగస్‌కు అడ్డుకట్ట పడుతుంది. నోటి ఆరోగ్యానికి హామీ లభిస్తుంది.
పటిక నీళ్లు యాస్ట్రింజెంట్ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని పుక్కిలిస్తే చిగుళ్లు గట్టిపడతాయి. వాపు తగ్గిపోతుంది. జింజివైటిస్ (చిగుళ్లవాపు), ఇతర చిగుళ్ల సమస్యలు ఉన్నవాళ్లకు పటిక నీళ్లు ప్రయోజనకరం.
పటిక నీళ్లకు చిన్నచిన్న గాయాలను నయం చేసే గుణం ఉంటుంది. కాబట్టి, నోట్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడితే తగ్గిస్తాయి.
ఓ గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. అందులో చిన్న పటిక ముక్కను వేయాలి. పూర్తిగా కరిగిపోనివ్వాలి. ఆ నీళ్లను మౌత్‌వాష్‌లా, పుక్కిలించడానికి వాడుకోవచ్చు. పుక్కిలించిన తర్వాత నీళ్లను ఉమ్మేయాలి.