Aloe Vera For Hair | ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలడంతోపాటు చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉంటాయి. కాలుష్యం, నివసిస్తున్న వాతావరణం, వాడుతున్న నీరు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం, హార్మోన్ల సమస్యలు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల వద్ద దురద కూడా వస్తుంది. దీంతో చుండ్రు పెరుగుతుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ కలబంద చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. కలబంద మొక్కలు మన అందరి ఇళ్లలోనూ పెరుగుతాయి. కలబంద గుజ్జును తాజాగా సేకరించి దాన్ని జుట్టుకు రాస్తుంటే జుట్టు సమస్యలు అన్నింటి నుంచి బయట పడవచ్చు. అందుకు గాను కలబందతో పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
2 టేబుల్ స్సూన్ల తాజా కలబంద గుజ్జును సేకరించాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే కొబ్బరినూనెను కాస్త వేడి చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. తరువాత 30 నుంచి 60 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటిస్తే చాలు, శిరోజాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనెను తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని జుట్టుకు బాగా రాయాలి. 20 నుంచి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కాను కూడా వారంలో ఒకసారి పాటించవచ్చు. దీంతో శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
కలబంద గుజ్జులో ఉల్లిపాయల రసం కలిపి రాస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఒక ఉల్లిపాయను కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా మార్చాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మోతాదులో కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. 1 గంట సేపు వేచి ఉన్నాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. కలబంద గుజ్జులో మెంతులను కలిపి కూడా జుట్టుకు రాయవచ్చు. 2 టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను మెత్తని పేస్ట్‌లా మార్చాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల మోతాదులో కలబంద గుజ్జును కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్‌ను కూడా వారంలో ఒకసారి ఉపయోగించవచ్చు. దీంతో కూడా జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు.
కలబంద మనకు ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, సౌందర్య పరంగా కూడా లాభాలను అందిస్తుంది. అయితే కలబంద అందరికీ పడదు. కొందరికి అలర్జీ ఉంటుంది. కనుక అలర్జీ ఉన్నవారు ముందుగా కలబందతో ప్యాచ్ టెస్ట్ చేయాలి. అందుకు గాను కొద్ది మొత్తంలో కలబంద గుజ్జును తీసుకుని చర్మంపై రాసి కాసేపు ఆగి చూడాలి. ఎలాంటి అలర్జీ రియాక్షన్ రాకపోతే మీరు కలబంద గుజ్జును ఉపయోగించవచ్చు. కలబంద గుజ్జుకు అలర్జీ ఉంటే చర్మం ప్రభావితమవుతుంది. వెంటనే చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తాయి. కనుక అలర్జీ ఉన్నవారు కలబంద గుజ్జును ఉపయోగించకూడదు. ఇక కలబంద గుజ్జు సహజసిద్ధంగా లభించింది అయి ఉండాలి. అలా ఉంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఏదైనా ఒక చిట్కాను మాత్రమే తరచూ పాటించాలి. దీంతో మెరుగైన ఫలితం లభిస్తుంది. ఇలా కలబందను వాడితే జుట్టు సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు.