గర్భ నిరోధక మాత్రలు తీసుకొనే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టిరాన్ ఉండే ఈ మాత్రలు.. ఆడవాళ్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని సదరు సర్వే హెచ్చరించింది. మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్తోపాటు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నది. ‘యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్’లో ఈ సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 18 నుంచి 49 ఏళ్ల వయసు మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ రావడానికి గల కారణాలపై యూరోపియన్ యూనియన్‌కు చెందిన పరిశోధకులు ప్రత్యేక సర్వే నిర్వహించారు.
ఇందులో 13 వేర్వేరు యూరోపియన్ దేశాల నుంచి క్రిప్టోజెనిక్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఉన్న 608 మంది రోగులు పాల్గొన్నారు. వారి హెల్త్ ట్రాక్‌ను క్షుణ్నంగా పరిశీలించిన అధ్యయనకారులు.. మిగతా వారితో పోలిస్తే గర్భ నిరోధక మాత్రలు వాడిన మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక గర్భధారణ నివారణకు మాత్రలు తీసుకోవడం కేవలం తాత్కాలిక పద్ధతి మాత్రమేననీ, అయినా కొందరు వీటిని తరచుగా తీసుకుంటున్నారని వారు వెల్లడించారు. ఫలితంగా మహిళల్లో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెబుతున్నారు.
ఈ మాత్రలు మహిళల శరీర పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని తీసుకున్న తర్వాత కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తుంది. వికారం, తలనొప్పి లాంటి సమస్యలు వేధిస్తాయి. హార్మోన్లలో అసమానతలు ఏర్పడి.. రుతుక్రమంలోనూ మార్పులు వస్తాయి. అధిక రక్తస్రావం, ఎక్కువ రోజులపాటు రుతుస్రావం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇక వీటిని ఎక్కువగా తీసుకుంటే.. భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోయే ప్రమాదం కూడా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ మాత్రలను తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాతే.. వీటిని వాడాలని అంటున్నారు.