శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Feb 15, 2020 , 01:58:14

రథోత్సవం.. రమణీయం

రథోత్సవం.. రమణీయం

అయిజ : తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలో తపస్సు చేసి సిద్ధి పొందియున్న తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటకు నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం వేద పండితులు ఆలయంలోని తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు పుష్పాలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారు జామున ఒంటి గంటకు తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని భక్తుల శివ నాస్మరణలు, పటాకుల మోత, నందికోలసేవ, భాజ భజంత్రీల నడుమ స్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. రథోత్సవం ముందు కుంభంకాగును భాజా భజంత్రీల నడుమ ఆలయానికి చేర్చి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. రథోత్సవానికి శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ చిన్న దేవన్న, ఎస్సై జగదీశ్వర్‌, ఆలయ కమిటీ సభ్యులు గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. రథోత్సవం సందర్భంగా శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై జగదీశ్వర్‌ గట్టి బందోబస్తు నిర్వహించారు. అనువణువునా పోలీసులు మోహరించి రథోత్సవం ప్రశాంతంగా జరిగేలా గట్టి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తిక్కవీరేశ్వర స్వామి యూత్‌, రైతు సంఘం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిక్కవీరేశ్వరుడికి ప్రత్యేక పూజలు ..

తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు తిక్కవీరేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో వెలసిన తిను బండారాలు, చెరుకు గడలు, కొత్త సామగ్రి, గాజులు, ఆట వస్తువులను భక్తులు కొనుగోలు చేశారు. తిక్కవీరేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు అశేష సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి.

నేడు కోలాటం పోటీలు ..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కట్టే కోలాటం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలకల కోలాటం పోటీలు నిర్వహించనున్నారు. రాత్రి తిక్కవీరేశ్వరస్వామి ఆలయంలో అంతర్‌ రాష్ట్ర భజన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. కట్టే కోలాటం పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 4,116, రెండో బహుమతి రూ. 3,116లను మాజీ సర్పంచ్‌ మీసాల కృష్ణయ్య నగదు అందజేయనుండగా,  పలకల కోలాటం పోటీలలో గెలుపొ ందిన విజేత లకు మొదటి బహుమతి 4,116, రెండో బహుమతి రూ. 3,116లను నిర్మిల్‌ కుమార్‌ (పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి)లు అందజేయ నున్నారు. భజన పోటీల విజేతలకు మొదటి బహుమతి రూ. 12,116, రెండో బహుమతి రూ. 10,116, మూడో బహుమతి రూ. 8,116, నాలుగో బహుమతి రూ. 6,116, ఐదవ బహుమతి 4,116లను అందజే యనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. 


logo