శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 29, 2020 , 00:34:33

జోగులంబా నమామ్యహం

జోగులంబా నమామ్యహం
  • జోగులంబా నమామ్యహం

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మూడు రోజులుగా వార్శిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. చంఢీహోమాలు, పవమాన సూక్త పారాయణ హోమాలు, ఆవాహిత దేవతా హోమం, మండపారాధన బలిహరణం చివరగా నీరాజన మంత్ర పుష్పములు తదితర పూజా  కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన, ఖడ్గమాల, త్రిశతి అర్చనకు అశేష ఆధరణ లభిస్తున్నది. గురువారం మాఘ పంచమి బ్రహ్మోత్సవాల చివరిరోజు భక్తలు అధిక సంఖ్యలో తరలొచ్చే అవకాశం ఉన్నది. 

అమ్మవారి నిజరూప దర్శనం

గురువారం యాగశాలలో నిత్యహోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన అనంతరం అమ్మ వారి నిజరూప దర్శన భాగ్యం ఉంటుంది. సాధరణ రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా అలంకరణ లేకుండా యోగ ముద్రలో ఉన్న అమ్మవారి మూల విరాట్‌  భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహిస్తారు.

సహస్ర ఘటాభిషేకం 

అమ్మవారి ఆలయంలో అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికీ రూ.200 చెల్లించి రశీదు పొందాలని ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. భక్తులు అభిషేక సమయంలో ఫలాలు, పంచామృతం, పుష్పములు సమర్పించుకోవచ్చని  నిర్వాహకులు పేర్కొన్నారు. చివరి రోజు ఉత్సవాలకు ఆలయం అన్ని విధాలుగా ముస్తాబు చేయనున్నారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్ళు, ప్రత్యేక క్యూ లైన్‌లు, ప్రసాద కౌంటర్లు, అదనపు సిబ్బంది తదితర ఏర్పాట్లు సమకూర్చారు. 

ప్రతి ఇంటి నుంచి కలశం 

వార్శిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి ఓ కలశం బయలుదేరి గ్రామంలో ఊరేగింపుగా వచ్చి ఆలయానికి  చేరుకుంటారు. గతంలో కంటే ఎక్కువగా భక్తులు కలశాలతో అమ్మవారికి అభిషేకాలు చేయనున్నట్లు జోగుళాంబ సేవా సమితి సభ్యులు యోచనలో ఉన్నారు. మండలంలోని కోనేరు, లింగనవాయి, సింగవరం-1,2, కాశాపురం, సుల్తానాపురం, గ్రామాల నుంచి భక్తులు కాలినడకన కలశాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయం చేరుకోనున్నట్లు వారు చెప్పారు.

భక్తులకు అన్నదానం

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జోగుళాంబ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోరింగ్‌ శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ శర్మ, ఉపాధ్యక్షుడు వెంకన్నబాబు, కార్యవర్గసభ్యులు వెంకట్రామయ్యశెట్టి తదితరులు తెలిపారు. గతంలో కంటే రెట్టింపు అలంకరణతో గ్రామ దేవతల వేషధారణతో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ దేవతల వేషధారణలతో ఊరేగింపు ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం అభిషేకం సమయం వరకు గ్రామ దేవతలు సాంప్రదాయ నృత్యాలతో ఆలయానిక చేరుకుంటారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలొస్తారు.

ఉత్సవాలకు ప్రముఖుల రాక

జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ వార్శిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్య, జిల్లా ఉన్నతాధికారులు  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహంతో పాటు పలువురు ప్రముఖులు  హాజరు కావచ్చని జోగుళాంబ సేవా సమితి  సభ్యులు తెలిపారు.

ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు

జోగుళాంబ అమ్మవారిని ఎస్‌బీఐ సీజీఎం ఓం ప్రకాష్‌శర్మ, ఏజీఎం కేజేవీ నాగరాజు, ఛీఫ్‌ మేనేజర్‌ ఉదయ్‌శంకర్‌, సుదరశర్మ, పద్మజారాణి దర్శించుకున్నారు. మరో సందర్భంలో ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సంధ్యపోగు మనోరమ సతీసమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. అంతుకుముందు వారికి ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌  సాదర స్వాగతం పలికారుlogo