‘పల్లెటూరి అమ్మాయిగా నటించాలనే నా కల ఈ సినిమా ద్వారా తీరింది’ అని చెప్పింది వాసంతి. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే మలినేని దర్శకుడు. ఆశాజ్యోతిగోగినేని నిర్మాత. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో వాసంతి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘బెంగళూరులో పుట్టి పెరిగిన తెలుగమ్మాయిని నేను. ఏరోనాటికల్ ఇంజినీర్‌ను కావాలని కలలు కన్నా. కానీ నా ఆలోచన విధానికి ఆ రంగం సెట్ కాకపోవడంతో నటనపై దృష్టిపెట్టా. కన్నడంలో ఐదు సినిమాలు చేశా. తెలుగులో ఇదే నా తొలి సినిమా. నీలవేణి అనే పల్లెటూరి యువతి పాత్రను పోషించా. సంపూర్ణేష్‌బాబు మరదలిగా సంప్రదాయం, అల్లరితనం కలబోతగా నా పాత్ర చలాకీగా సాగుతుంది. బావను అమితంగా ప్రేమించే నీలవేణి అతడి లక్ష్యసాధనకు ఏ విధంగా అండగా నిలిచింది? మరదలి ప్రేమను క్యాలీఫ్లవర్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొత్తం నేను లంగా, ఓణిలోనే కనిపిస్తా. తెలుగు సినిమాలు చూస్తా. నాని నా అభిమాన కథానాయకుడు. ఆయనతో కలిసి సినిమా చేయాలనుంది. ప్రస్తుతం ఆదిసాయికుమార్ చిత్రంతో పాటు మారుతి టీమ్ నిర్మించనున్న మరో సినిమాలో నటిస్తున్నా’ అని చెప్పింది.