సంఘర్షణలన్నీ ముండ్లయి
మది గది గోడలను గాయపరుస్తూ
సమస్యల మబ్బులు
ఎదక్షేత్రాన్ని కమ్ముకొని
భవిత అగమ్యగోచరమైనప్పుడు
ఘనీభవించిన గుండెలోంచి
ఆత్మవిశ్వాస లావా పెల్లుబుకాలి..!
ఆశించినదేదో అందని ద్రాక్షై
కన్న కలలేవో మరీచికలై
ఆశల వనాన్ని
నిరాశ శిశిరం ఆక్రమించినప్పుడు..
పట్టుదల పల్లవులు చిగురిస్తూ
సాధికార వాసంతాన్ని ఆహ్వానించాలి..!
కష్టాల సునామి ప్రళయమై ప్రభవిస్తూ
జీవన నావ తడబడుతూ
ఆటంకాల సుడిగుండాలు అనివార్యమై
పయనపు పాదాలను లాగేసినప్పుడు
మెదడు సాగరంలో ఆలోచనామృతాన్ని చిలకాలి..!
కనురెప్పల మాటు నుంచి
కన్నీటిధార జాలువారుతూ
అవకాశ మార్గం మసకబారినప్పుడు
నిబ్బరపు రెటీనా నుంచి
ప్రయత్న రశ్మి ప్రపుల్లించాలి..!
జయమో పరాజయమో సందేహించక
బతుకు రణరంగాన నమ్మకమే ఆయుధంగా మలిచి
యుద్ధానికి సిద్ధమవ్వాలి..
అలుపెరుగని పోరుకు సంకల్పించాలి…
-అయిత అనిత
8985348424